కూతురినే చంపాలనుకున్న తండ్రి
Father pays Rs 1 lakh to kill daughter in UP over love affair. ఉత్తరప్రదేశ్‌లో కన్న కూతురినే కడతేర్చాలనుకున్నాడు ఓ తండ్రి.
By Medi Samrat Published on 7 Aug 2022 4:56 AM GMTఉత్తరప్రదేశ్‌లో కన్న కూతురినే కడతేర్చాలనుకున్నాడు ఓ తండ్రి. ఎన్నిసార్లు చెప్పినా మాట వినకపోవడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కుమార్తెను ప్రియుడితో ఉన్న ప్రేమ సంబంధాన్ని తెంచుకోవాలని పలుమార్లు హెచ్చరించాడు తండ్రి. మాట వినకపోవడంతో.. ఆ తండ్రి ఆసుపత్రి వార్డ్ బాయ్‌తో కలిసి కూతురు శరీరంలోకి అధిక మోతాదులో పొటాషియం క్లోరైడ్‌ను పంపించాడు. దీంతో ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. యువతి తండ్రి నవీన్ కుమార్ కాగా, వార్డు బాయ్ నరేష్ కుమార్. వీరివురిని శనివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
నవీన్ కుమార్ తన కుమార్తెను శుక్రవారం అర్థరాత్రి కంకర్‌ఖేడాలోని ఆసుపత్రిలో చేర్పించాడు. అనంతరం కొన్ని గంటల తర్వాత అతను ఆమెను మోడీపురంలోని ఫ్యూచర్ ప్లస్ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ రాత్రి యువతి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించిందని పోలీసు అధికారి తెలిపారు. పరీక్షల్లో వైద్యులు ఆమెకు అధిక మోతాదులో పొటాషియం క్లోరైడ్ ఇంజెక్ట్ చేసినట్లు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా ఇంజక్షన్ ఇచ్చిన వ్యక్తి నరేష్‌కుమార్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు.
విచారణలో నవీన్ కుమార్ యువతిని చంపడానికి లక్ష రూపాయలు ఇచ్చాడని పోలీసులకు చెప్పాడు నరేష్ కుమార్. వైద్యుడిలా నటిస్తూ మహిళా ఉద్యోగి సాయంతో ఐసీయూలోకి ప్రవేశించి ఇంజక్షన్ వేసినట్లు పోలీసులు తెలిపారు. నరేష్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆ మహిళా ఉద్యోగిని, బాధితురాలి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు.
తన కుమార్తెకు ఓ వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని.. పలుమార్లు హెచ్చరించినా సంబంధం తెంచుకోవడానికి ఆమె అంగీకరించ లేదని నవీన్ కుమార్ పోలీసులకు చెప్పాడు. బాలికను ఆసుపత్రిలో చేర్పించే సమయంలో మాత్రం కోతుల బెదిరింపులకు పడిపోయిందని వైద్యులకు తెలపగా.. వాస్తవానికి ఆమె ఇంటి పైకప్పుపై నుంచి దూకిందని నవీన్ పోలీసులకు తెలిపాడు. నరేష్‌కుమార్ నుంచి పొటాషియం క్లోరైడ్‌తో కూడిన విరిగిన ఇంజక్షన్‌తో పాటు రూ.90,000ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.