హృదయ విదారకం.. నలుగురు పిల్లలకు విషం కలిపిన పాలు తాగించిన తండ్రి.. ముగ్గురు మృతి
బీహార్‌లోని అర్రాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది.
By Medi Samrat Published on 12 March 2025 10:41 AM IST
బీహార్‌లోని అర్రాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. అక్కడ ఓ తండ్రి పాలలో విషం కలిపి తన నలుగురు పిల్లలకు ఇచ్చి ఆ తర్వాత తానూ విషం తాగాడు. వీరిలో ముగ్గురు చిన్నారులు చనిపోయారు. ఇద్దరు చికిత్స పొందుతున్నారు. అరవింద్ కుమార్ అనే వ్యక్తి తన పిల్లలతో కలిసి విషం సేవించినట్లు సమాచారం.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు ఆదర్శ్ మాట్లాడుతూ.. 8 నెలల క్రితం తన తల్లి అనారోగ్యంతో చనిపోయిందని.. దీంతో తన తండ్రి చాలా బాధపడేవాడని తెలిపాడు. బెన్వాలియా మార్కెట్‌లో చిన్న ఎలక్ట్రానిక్ దుకాణం నడుపుతూ మమ్మల్ని పోషించేవాడు.. మంగళవారం రాత్రి భోజనంలో మాకు ఇష్టమైన పూరీని తినిపించి, అందరికీ గ్లాసు పాలు ఇచ్చి తానూ స్వయంగా తాగారు. కొంత సమయం తరువాత మాకు వాంతులు ప్రారంభమయ్యాయి.. తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. మేము ఎవరి సహాయం తీసుకోలేని పరిస్థితి. అంతా గదిలో నొప్పితో మెలికలు తిరుగుతున్నారు కానీ ఎటూ కదలలేకపోయాం. చాలాసేపటి తర్వాత తలుపు తెరుచుకుంది. తర్వాత అందరినీ చికిత్స నిమిత్తం అర్రాలోని సదర్ ఆసుపత్రిలో చేర్చారని వెల్లడించాడు.
గ్రామస్థుడు గుప్తేశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ.. గ్రామంలోని పొరుగువారి ఇంట్లో పెళ్లి ఊరేగింపు జరుగుతోందని, దానికి హాజరయ్యేందుకు ప్రజలంతా వెళ్లారని తెలిపారు. ఇంతలో పిల్లల ఆరోగ్యం క్షీణించిందని అరవింద్ మేనల్లుడు ఫోన్ చేశాడు. రంపంతో వెళ్లి గది తలుపులు తీశాం. అరా ఆస్పత్రికి వెళ్లిన తర్వాత అందరూ విషం సేవించినట్లు తెలిసిందన్నారు. చికిత్స పొందుతూ ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు మృతి చెందారని పేర్కొన్నారు.
అరవింద్ భార్య చనిపోవడంతో దుకాణం నడుపుతూ తన పిల్లలను చదివించేందుకు పంపేవాడు. కానీ, భార్య చనిపోయిన తర్వాత పిల్లలను చూసుకోవడంలో అరవింద్‌కు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో విషం సేవించినట్లు తెలుస్తుంది.
ఏ విషం తాగారు అనేది ఇంకా నిర్ధారణ కాలేదని ఆన్ డ్యూటీ డాక్టర్ డాక్టర్ శివ నారాయణ్ సింగ్ తెలిపారు. చికిత్స పొందుతున్న పిల్లలకు ఒంటి నొప్పులు, వాంతులు, కడుపు నొప్పులు ఉన్నాయి. నోటి నుంచి, ముక్కు నుంచి నురుగు వస్తోంది. ప్రస్తుతం బృందం పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని డాక్టర్ తెలిపారు.