మూడు నెలల పసికందును నేలకేసి కొట్టి చంపిన తండ్రి
బీహార్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. గత మంగళవారం రాత్రి తానాలోని మసోధిలోని లహ్సునా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఘోరువా గ్రామంలో ఓ తండ్రి తన మూడు నెలల కొడుకును నిద్రిస్తున్నప్పుడు నేలపై విసిరి చంపాడు.
By Medi Samrat
బీహార్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. గత మంగళవారం రాత్రి తానాలోని మసోధిలోని లహ్సునా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఘోరువా గ్రామంలో ఓ తండ్రి తన మూడు నెలల కొడుకును నిద్రిస్తున్నప్పుడు నేలపై విసిరి చంపాడు. ఈ సమయంలో బిడ్డను కాపాడేందుకు వచ్చిన తల్లిని కూడా కొట్టాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పీఎంసీహెచ్‌కు తరలించారు. నిందితుడిని పోలీసులు బుధవారం మధ్యాహ్నం అరెస్టు చేశారు.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు వికాస్ ఎండు మత్తు పదార్థాలైన స్మాక్ తదితరాలకు అలవాటు పడ్డాడని, సంఘటన జరిగిన సమయంలో అతడు బాగా తాగి ఉన్నాడని తెలిపారు. నిందితుని భార్య గుడ్డి, సోదరి మోనా పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. వికాస్ వృత్తిరీత్యా కూలీగా పనిచేస్తున్నాడు. వికాస్ మంగళవారం సాయంత్రం ఇంటికి వచ్చి భోజనం చేయకుండా తన గదిలోకి వెళ్లాడు. దోమల బెడద వల్ల భార్య గుడ్డి ఇంట్లో పొగ పెట్టింది. పొగ కారణంగా వికాస్ గది నుంచి బయటకు వచ్చి భార్య గుడ్డిని, సోదరిని దుర్భాషలాడాడు. ఈ క్రమంలో వారి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన వికాస్ తన మూడు నెలల చిన్నారిని ఎత్తుకుని పడేశాడు. ఆ తర్వాత కూడా సంతృప్తి చెందక మళ్లీ చిన్నారిని ఎత్తుకుని నేలపై పడేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన అనంతరం వికాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. అయితే తర్వాత కుటుంబీకులు చిన్నారిని నర్సింగ్‌హోమ్, సబ్ డివిజనల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అయితే అక్కడి వైద్యులు బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. బుధవారం ఉదయం సమాచారం అందిన వెంటనే లహ్సునా పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం ఘోరహువాలోని నిందితుడి ఇంటి పెరడులో వికాస్‌ను అరెస్టు చేశారు. తర్వాత ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం పాట్నా నుంచి వచ్చి శాంపిల్‌ను పరీక్ష కోసం తీసుకువెళ్లింది.
నిందితుడు వికాస్‌ను అరెస్టు చేశామని.. పోలీసులు అతన్ని విచారిస్తున్నారని లహ్సునా పోలీస్ స్టేషన్ ఇంఛార్జి ఖుష్బూ ఖాతున్ చెప్పారు.వికాస్ కుమార్ ఏడాదిన్నర క్రితం గుడ్డి కుమారిని ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలిపారు. మూడు నెలల క్రితం గుడ్డి కుమారి మగబిడ్డకు జన్మనిచ్చిందని వెల్లడించారు.