జార్ఖండ్ రాష్ట్రంలోని చత్రా జిల్లాలో ఒక భూతవైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు 14 ఏళ్ల బాలికను కొట్టి, దుష్టశక్తులను పారద్రోలుతానని అగరబత్తులతో కాల్చినందుకు అరెస్టు చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. హోలీ ఆడిన తర్వాత బాలిక అస్వస్థతకు గురైంది. భూతవైద్యుడు, మౌలానా ఎమ్‌డి వాహిద్, భూతవైద్యం ద్వారా ఆమె బాగుపడుతుందని ఆమె కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చాడు. నాలుగు రోజులుగా, వాహిద్ బాలికను చిత్రహింసలకు గురిచేయడంతో.. ఆ బాలిక మెంటల్ బ్యాలెన్స్ ను కోల్పోయిందని పోలీసులు తెలిపారు. అతను ఆమెను కొట్టి, ముఖం, పెదవులు, చేతులపై అగరబత్తీలతో కాల్చాడని పోలీసులు చెప్పారు.
ఈ ఘటన తర్వాత బాలికను చత్రా లోని సదర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి క్షీణించడంతో, ఆమెను రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (RIMS) లో చేర్చారు. బాలిక కుటుంబ సభ్యులు లావాలాంగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వాహిద్ (35)ను అరెస్టు చేసినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాకేష్ రంజన్ తెలిపారు. 307 (హత్యాయత్నం), లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పీసీఎస్‌ఓ) చట్టంతో సహా ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.