ముంబైలో సోమవారం బలమైన ఈదురుగాలులు వీచాయి. ఈ సీజన్‌లో తొలి వర్షంతో పాటు వీచిన ఈదురుగాలులు ఘట్‌కోపర్ ప్రాంతంలో విధ్వంసం సృష్టించాయి. ఈదురుగాలుల దాటికి ఘాట్‌కోపర్‌లో 100 అడుగుల ఎత్తైన హోర్డింగ్ నేలకూలింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా.. 70 మందికి పైగా గాయపడ్డారు.
సోమవారం సాయంత్రం ఘట్‌కోపర్, బాంద్రా కుర్లా, ధారవి ప్రాంతాల్లో వర్షంతో పాటు బలమైన గాలులు వీచాయి. గాలుల ధాటికి మరోవైపు ముంబై విమానాశ్రయంలో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. గాలుల కారణంగా 15 విమానాలను దారి మళ్లించినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.
హోర్డింగ్ పడిపోవడంతో ముంబై పోలీసులు ఇగో మీడియా యజమానితో పాటు ఇతరులపై కేసు నమోదు చేశారు. భారత శిక్షాస్మృతిలోని 304, 338, 337 సెక్షన్ల కింద భూస్వామి భవేష్ భిండేతో పాటు ఇతరులపై కూడా కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పంత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.