కాదేదీ స్మగ్లింగ్ కు అనర్హం.. లెహంగాలలో డ్రగ్స్

Drugs Found Hidden In Lehengas Bound For Australia. డ్రగ్స్ ను స్మగ్లింగ్ చేయడానికి ఎన్నో మార్గాలను వెతుకుతూ ఉన్నారు.

By Medi Samrat  Published on  10 Feb 2021 1:50 PM GMT
కాదేదీ స్మగ్లింగ్ కు అనర్హం.. లెహంగాలలో డ్రగ్స్

డ్రగ్స్ ను స్మగ్లింగ్ చేయడానికి ఎన్నో మార్గాలను వెతుకుతూ ఉన్నారు. కొన్ని కొన్ని పద్ధతుల ద్వారా చేసే స్మగ్లింగ్ లను అధికారులు చాలా సులువుగా పట్టేసుకుంటూ ఉండగా.. అది కాకపోతే ఇంకో దారిలో వెళదామని అనుకుంటూ ఉన్నారు డ్రగ్స్ స్మగ్లర్లు. తాజాగా ఏకంగా ఆడవారు వేసుకునే లెహంగాలతో కూడా డ్రగ్స్ స్మగ్లింగ్ ను చేసేస్తూ ఉన్నారు. అమ్మాయిల డ్రెస్‌లో డ్రగ్స్‌ పెట్టి విదేశాలకు ఎగుమతి చేయాలనుకున్నారు. ఈ మేరకు డ్రెస్‌లో కోటి 70 లక్షల విలువైన డ్రగ్స్‌ పెట్టి పోస్టు ద్వారా ఆస్ట్రేలియాకు పంపించాలనుకున్న ప్రయత్నం విఫలమైంది. వారిని ఢిల్లీ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

ఢిల్లీకి చెందిన ఓ వ్య‌క్తి లెహెంగను ఆస్ట్రేలియాకు పంపేందుకు ఢిల్లీ సరిహద్దులోని నోయిడాలో ఉన్న విదేశీ పోస్టాఫీస్‌కు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న నిఘా వ‌ర్గాలు పోస్టాఫీస్‌ అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. ఆ లెహెంగాను పరిశీలించి వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు ఆ డ్రెస్‌ను నిశితంగా పరిశీలించగా అందులో రూ. కోటి 70 లక్షలు విలువ చేసే 3,900 గ్రాముల డ్ర‌గ్స్ బ‌య‌ట‌ప‌డ్డాయి. డ్రగ్స్‌ స‌ర‌ఫ‌రా చేయడానికి ప్ర‌య‌త్నించిన వ్య‌క్తిని క‌స్ట‌మ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 7 లెహెంగాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి రాజస్థాన్‌లో మూలాలు ఉన్నాయని తెలుస్తోంది.


Next Story