పెళ్లైన రెండు నెలలకే ప్రియుడితో పారిపోయిన మహిళ.. భర్త, మధ్యవర్తి ఆత్మహత్య..!
కర్నాటకలో ప్రియుడితో కలిసి భార్య పారిపోయిందని ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.
By - Medi Samrat |
కర్నాటకలో ప్రియుడితో కలిసి భార్య పారిపోయిందని ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వార్త బయటకు రావడంతో వీరి పెళ్లి కుదిర్చిన వ్యక్తి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హరీష్, సరస్వతిల వివాహాన్ని మహిళ మామ రుద్రేష్ నిర్వహించారు. కాగా, జనవరి 23న సరస్వతి.. గుడికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయితే ఆమె తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సరస్వతి తన ప్రియుడు శివకుమార్‌తో కలిసి పారిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. భార్య పారిపోయిందన్న వార్త విని 30 ఏళ్ల హరీష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు హరీష్ సూసైడ్ నోట్ రాసి, అందులో బాధ్యుల పేర్లను పేర్కొన్నాడు. హరీష్ మరణవార్త తట్టుకోలేక అతని బంధువు, సరస్వతి మామ రుద్రేష్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సరస్వతికి పెళ్లికి ముందే అక్రమ సంబంధం ఉందని, ఆ విషయం భర్త హరీశ్‌కు ముందే తెలుసని ప్రాథమిక విచారణలో తేలింది. సరస్వతితో పెళ్లికి హరీష్ తన కుటుంబాన్ని ఒప్పించాడని పోలీసులు వెల్లడించారు.
దావణగెరె రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సీ/ఎస్టీ (అట్రాసిటీ నిరోధక) చట్టం కింద రెండు కేసులు నమోదు చేసినట్లు దావణగెరె పోలీస్ సూపరింటెండెంట్ ఉమా ప్రశాంత్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు అందాయి. విచారణ ప్రారంభించాం. మానసిక వేదనతో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.