కరస్పాండెంట్‌ లైంగిక వేధింపులు.. రోజు రాత్రి 10 గంటలకు 15 మంది బాలికలను

Dindigul nursing students flag sexual abuse. వార్డెన్ 'కాన్వాస్' చేసి 10 నుంచి 15 మంది బాలికల బృందాన్ని రాత్రి 10 గంటల సమయంలో కరస్పాండెంట్ యాజమాన్యంలోని

By అంజి  Published on  20 Nov 2021 11:32 AM IST
కరస్పాండెంట్‌ లైంగిక వేధింపులు.. రోజు రాత్రి 10 గంటలకు 15 మంది బాలికలను

తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కాలేజీ కరస్పాండెంట్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ చెన్నై నగర శివార్లలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ కాలేజీకి చెందిన దాదాపు 250 మంది విద్యార్థినులు డిండుగల్‌-పళని రోడ్డుపై, కళాశాల ఎదుట రాస్తారోకోకు దిగారు. దిండుగల్‌లోని 250 మంది విద్యార్థినిలు చదువుతున్న ఓ ప్రైవేట్‌ నర్సింగ్‌ కాలేజీలో జ్యోతిమురుగన్‌ కరస్పాండెంట్‌గా పని చేస్తున్నారు. జ్యోతిమురుగన్‌ విద్యార్థినిలను లైంగికంగా వేధిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న 100 మందికిపైగా విద్యార్థినిలు 1098 హెల్ప్‌ లైన్‌ నెంబర్‌ కాల్‌ చేసి ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే సుమారు 200 మంది విద్యార్థులు రోడ్డుపై బైటాయించారు. విషయం తెలుసుకున్న జిల్లా పోలీసులు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థినిలతో వారి సమస్యపై చర్చించారు. డిండుగల్ రేంజ్ డిఐజి విజయకుమారి, రెవెన్యూ అధికారులతో చర్చల తర్వాత విద్యార్థినిలు సాయంత్రం ఆలస్యంగా నిరసన విరమించారు. అప్పటికే జ్యోతిమురుగన్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో హాస్టల్‌ వార్డెన్‌ అర్చనను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరోవైపు జ్యోతిమురుగన్‌ తండ్రి పళనిస్వమి, ఆయన కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.

కాలేజీ కరస్పాండెంట్ పి జ్యోతిమురుగన్ 2019లో డిండుగల్ పార్లమెంటరీ నియోజకవర్గానికి AMMK అభ్యర్థిగా ఉన్నారు. అతను జిల్లాలో ఒక నర్సింగ్, క్యాటరింగ్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీని కలిగి ఉన్నాడని విచారణలో వెల్లడైంది. బాధితుల్లో 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నారని నిరసన తెలుపుతున్న బాలికలను విచారించిన చైల్డ్‌లైన్ జిల్లా కోఆర్డినేటర్ వి నికోలస్ అన్నారు. వార్డెన్ 'కాన్వాస్' చేసి 10 నుంచి 15 మంది బాలికల బృందాన్ని రాత్రి 10 గంటల సమయంలో కరస్పాండెంట్ యాజమాన్యంలోని మరొక కాలేజీకి పంపుతారని విద్యార్థులు చెప్పారని తెలిపాడు. చీకట్లో విద్యార్థులను కరస్పాండెంట్‌కు నచ్చే విధంగా పాటలకు డ్యాన్స్ చేయమని, ఆ తర్వాత లైంగికంగా వేధించేవాడని తెలిపారు.అనంతరం తెల్లవారుజామున 3 గంటల సమయంలో విద్యార్థులను తిరిగి హాస్టల్‌లోకి దింపేవారని వెల్లడించారు.

పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయని, సకాలంలో మంచి ఆసుపత్రుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని, వినోద పరిశ్రమలో ఆకర్షణీయమైన ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి బాలికలను ఉచ్చులోకి నెట్టాడని తెలుస్తోంది. ఓ విద్యార్థిని చేసిన ఫిర్యాదు మేరకు కరస్పాండెంట్‌, హాస్టల్‌ వార్డెన్‌పై పోక్సో చట్టంతో సహా కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు దిండిగల్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) వీఆర్ శ్రీనివాసన్ తెలిపారు. కరస్పాండెంట్‌ జ్యోతిమురుగన్‌ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

Next Story