నైరుతి ఢిల్లీలోని నవాడాలో వాగ్వాదం కారణంగా ఓ స్కూల్ టీచర్ తన భార్యను హతమార్చాడు. అతడు తన తొమ్మిదేళ్ల కుమార్తె ఎదుటే భార్యను కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు శనివారం తెలిపారు. శుక్రవారం సాయంత్రం 6.24 గంటలకు దంపతుల మధ్య జరిగిన గొడవకు సంబంధించి తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. మహిళకు తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోయిందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
పోలీసులు ఆ దంపతులు నివాసముంటున్న నవాడ కక్రోలా హౌసింగ్ కాంప్లెక్స్‌కు చేరుకోగా, అప్పటికే మహిళ చనిపోయి కనిపించిందని తెలిపారు. అయితే ఆమె భర్త కనిపించలేదు. తన తండ్రి తన తల్లిని కత్తితో పొడిచి చంపాడని వారి కుమార్తె పోలీసులకు చెప్పిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ద్వారక) ఎం హర్ష వర్ధన్ తెలిపారు. మోహన్ గార్డెన్ పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదు చేశామని, నిందితుడిని పట్టుకునేందుకు టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు డీసీపీ తెలిపారు. నిందితుడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడని పోలీసులు తెలిపారు.