పదే పదే పారిపోతున్న నిందితుడిని గ్లామరస్ నటిగా నటిస్తూ వ‌ల‌లో వేసుకున్నారు..!

ఢిల్లీ పోలీసులు ముంబైకి చెందిన ఓ మోడల్‌గా నటిస్తూ, నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్ క్రియేట్ చేసి ఒక గ్యాంగ్‌స్టర్‌ను పట్టుకున్నారు.

By Medi Samrat
Published on : 22 March 2025 3:57 PM IST

పదే పదే పారిపోతున్న నిందితుడిని గ్లామరస్ నటిగా నటిస్తూ వ‌ల‌లో వేసుకున్నారు..!

ఢిల్లీ పోలీసులు ముంబైకి చెందిన ఓ మోడల్‌గా నటిస్తూ, నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్ క్రియేట్ చేసి ఒక గ్యాంగ్‌స్టర్‌ను పట్టుకున్నారు. నీక్కావలసింది నా దగ్గర ఉంది అంటూ ఫేక్ అకౌంట్ ద్వారా ప్రలోభపెట్టి గ్యాంగ్ స్టర్ ను అరెస్టు చేశారని ఒక అధికారి తెలిపారు. జీవిత ఖైదు అనుభవిస్తూ, పదే పదే పెరోల్ లో పారిపోతున్న నిందితుడు మనోజ్, దక్షిణ ఢిల్లీలో తిరుగుతూ ఉండడగా అతన్ని అరెస్టు చేశారు.

"గోగి గ్యాంగ్ సభ్యుడు దీపక్ సన్నిహితుడు మనోజ్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్‌లలో హత్య, కిడ్నాప్ మరియు సాయుధ దోపిడీతో సహా పలు కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడు" అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) (క్రైమ్) ఆదిత్య గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. తీహార్ జైలులో ప్రత్యర్థి గ్యాంగ్‌స్టర్ టిల్లు తాజ్‌పురియా హత్యలో దీపక్ కీలక కుట్రదారుడు. మనోజ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నాడని తెలుసుకుని, క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన ప్రత్యేక బృందం డిజిటల్ ఆపరేషన్‌ను రూపొందించింది. "హెడ్ కానిస్టేబుళ్లు దినేష్, సుఖ్‌బీర్ ముంబైకి చెందిన గ్లామరస్ నటిగా నటిస్తూ నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్‌ను సృష్టించారు. అనేక వారాల పాటు చాటింగ్ చేయడం ద్వారా మనోజ్ కు నమ్మకాన్ని కలిగించారు. చివరికి, దక్షిణ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్ ప్రాంతంలో కలవమని అతన్ని ఒప్పించారు" అని డీసీపీ చెప్పారు. మనోజ్ వచ్చినప్పుడు, వేచి ఉన్న పోలీసు బృందం అతన్ని పట్టుకుంది. అతని వస్తువులను తనిఖీ చేయడంలో రెండు ఆయుధాలు, ఎనిమిది లైవ్ కార్ట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. అతన్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

Next Story