దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని చాందినీ చౌక్‌లో ఈ రోజు తెల్లవారుజామున 4.45 గంటలకు లాలా లజపత్ రాయ్ మార్కెట్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో దాదాపు 60 దుకాణాలు, స్టాళ్లు దగ్ధమయ్యాయి. క్రమ క్రమంగా మంటలు చెలరేగుతూ మార్కెట్ మొత్తం వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను ఆర్పేందుకు 12 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి తీసుకువచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఎర్రకోట ఎదురుగా ఉన్న లజపత్ రాయ్ మార్కెట్‌లో తెల్లవారుజామున 4.45 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది, స్థానిక నివాసితులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించగా, సంఘటన స్థలం నుండి వచ్చిన దృశ్యాలు దుకాణాలను మింగుతున్న పొడవైన మంటలను చూపించాయి. తర్వాత ఘటనా స్థలిలో కాలిపోయిన దుకాణాలు, ఉత్పత్తులు బూడిదగా మారినట్లుగా ఫొటోలు చూపించాయి. అయితే అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.