ఇటీవలి కాలంలో ఏటీఎం దొంగతనాలకు సంబంధించిన వార్తలను మనం తరచుగా వింటూ ఉన్నాం. ఏవేవో వస్తువులను ఉపయోగించి ఏటీఎంలను దోపిడీ చేస్తూ ఉంటారు. గ్యాస్ కటర్ అంటూ.. ఏవేవో టెక్నాలజీ సహాయంతో ఏటీఎం దోపిడీని చేసే వారి గురించి విన్నాం. అయితే అట్లు వేసే పెనంతో దోచుకోవాలని ప్రయత్నించిన ఓ వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 'తవా' (ఫ్రైయింగ్ పాన్) ఉపయోగించి ఏటీఎంను కొల్లగొట్టడానికి ప్రయత్నించినందుకు 34 ఏళ్ల వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌కు చెందిన ఆషాద్ అలీ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉత్తమ్ నగర్‌లోని ఏటీఎంలో దోపిడీ చేయడానికి ప్రయత్నించినట్లు పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోగా, నిందితుడు పారిపోయాడు. అదనపు విచారణ తర్వాత, ఉత్తమ్ నగర్ నివాసి ఈ పని చేశాడని కనుగొన్నారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 380 మరియు 511 కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేయబడింది. నిందితుడిని వేటాడేందుకు, దాదాపు 450-475 CCTV కెమెరాల ఫుటేజీని విశ్లేషించారు. పలువురి నుంచి వచ్చిన సమాచారం మేరకు ఆషాద్‌ను అతని ఇంట్లో అరెస్టు చేశారు. చోరీకి యత్నించిన సమయంలో ఉపయోగించిన పెనం, బూట్లు, జాకెట్, బట్టలను పోలీసులు గుర్తించారు.