ఢిల్లీలోని సుల్తాన్‌పూర్‌లో గురువారం నాడు 47 ఏళ్ల వ్యక్తి తన భార్యను కొట్టి, ఆమెకు ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. భర్త మద్యం సేవించాడు. రాత్రి భోజనం తయారు చేసేందుకు భార్య నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం ముదరడంతో చివరికి ఆమెను హత్య చేశాడు. ఆ వ్యక్తి మృతదేహం పక్కనే నిద్రపోయాడు. మేల్కొన్న తర్వాత ఆమె చనిపోయిందని గ్రహించాడు. సుల్తాన్‌పూర్‌కు చెందిన వినోద్‌కుమార్ దూబే (47) అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. హత్య చేసిన తర్వాత నిందితుడు ఢిల్లీ నుండి రూ. 40,000 నగదుతో పారిపోవడానికి ప్రయత్నించాడు, అయితే అతన్ని పట్టుకుని అరెస్టు చేశారు.
జూన్ 17న ఉదయం 9.30 గంటలకు వినోద్ కుమార్ దూబే తన భార్య సోనాలి దూబేని హత్య చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు భార్యను దిండుతో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసినట్లు గుర్తించారు. పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని 259, 202, 302 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. "ఒక పోలీసు బృందం నిందితుడి గురించి స్థానికులను విచారించింది. నిఘా, సాంకేతిక విశ్లేషణల ద్వారా, నిందితుడి లొకేషన్‌ను చూశారు. దాని ఆధారంగా వినోద్ కుమార్ దూబేను అరెస్టు చేశారు, " అని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ( సౌత్) పవన్ కుమార్ తెలిపారు.అతని వద్ద నుండి మొత్తం 43,280, అతని వస్తువులతో కూడిన బ్యాగ్, రెండు మద్యం సీసాలు, రక్తంతో తడిసిన దిండు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.