భార్యకు బహుమతులు కొనాలని ఓ వ్యక్తి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన ద్వారక ప్రాంతంలో చోటు చేసుకుంది. తన భార్యకు వార్షికోత్సవ బహుమతులు కొనడానికి రూ.8 లక్షల చోరీకి పాల్పడిన కేసులో 34 ఏళ్ల వ్యక్తిని, అతని సహచరుడిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. నిందితులను మనోజ్ కుమార్ (34), అశోక్ కుమార్ (39) గా గుర్తించారు.
మార్చి 21 రాత్రి కాక్రోలాలోని ఒక దుకాణంలోకి చొరబడి నిందితులు రూ.8 లక్షల నగదుతో పారిపోయారు. 100 కి పైగా సిసిటివి కెమెరాలను విశ్లేషించి, అనుమానితుల కదలికలను ట్రాక్ చేసిన తర్వాత, పోలీసులు వారిని గుర్తించి అరెస్టు చేశారని పోలీసులు తెలిపారు. మనోజ్ కుమార్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. తన భార్య వివాహ వార్షికోత్సవానికి మొబైల్ ఫోన్ బహుమతిగా ఇవ్వాలనుకున్నాడు. అశోక్ కుమార్ కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. అందుకే ఇద్దరూ కలిసి ఈ నేరానికి పాల్పడినట్లు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. వారిని అరెస్టు చేసిన తర్వాత, నేరానికి ఉపయోగించిన కారు, దోపిడీకి ఉపయోగించే పనిముట్లు, నాలుగు మొబైల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో రెండు దొంగిలించిన డబ్బుతో కొనుగోలు చేసినవని డిసిపి తెలిపారు.