Hyderabad : అన్న ఇంటికే క‌న్నమేసిన చెల్లి

ఓ చెల్లి గుట్టు చప్పుడు కాకుండా సోదరుడి సొమ్మును కాజేసింది. ఆ త‌ర్వాత ఏమీ తెలియ‌న‌ట్లు న‌టించింది.

By Medi Samrat
Published on : 18 July 2025 9:33 AM IST

Hyderabad : అన్న ఇంటికే క‌న్నమేసిన చెల్లి

ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అనే సామెత మ‌నం వినే ఉంటాం. ఓ ఇంట్లో కూడా సామెత‌ను పోలిన ఘటన జరిగింది. ఓ చెల్లి గుట్టు చప్పుడు కాకుండా సోదరుడి సొమ్మును కాజేసింది. ఆ త‌ర్వాత ఏమీ తెలియ‌న‌ట్లు న‌టించింది. కానీ, చివరకు పోలీసుల దర్యాప్తులో అసలు విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని కుత్బుల్లాపూర్‌లో జరిగింది.

వివ‌రాళ్లోకెళితే.. కుత్బుల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న సుబ్రహ్మణ్యం శ్రీకాంత్ అనే యువకుడు జులై 5వ తేదీన తన కారు పూజ కోసం దేవాలయానికి వెళ్ళాడు. తిరిగి ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉండడంతో చోరీ జరిగినట్లుగా గుర్తించిన శ్రీకాంత్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు రంగంలోకి దిగిన పోలీసులు.. ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ సాయంతో శ్రీకాంత్ సోద‌రి దొంగ‌త‌నానికి పాల్ప‌డిన‌ట్లు గుర్తించారు. దీంతో పోలీసులతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యపోయారు.

అయితే విచార‌ణ‌లో ప‌లు విష‌యాలు వెలుగు చూశాయి. శ్రీకాంత్ సోదరి ఆన్‌లైన్‌ బెట్టింగ్, క్యాసినోలకు బానిసైయింది. బెట్టింగ్ ఆడి ఇప్ప‌టివ‌ర‌కూ ఐదు లక్షల వరకూ నష్టపోయి అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో ఎలాగైనా సరే అప్పు తీర్చేయాలని అనుకుంది. ఈ క్ర‌మంలోనే ఆమె కుటుంబ సభ్యులందరూ కర్మన్ ఘాట్‌కు వెళ్లే విషయాన్ని గుర్తించింది. అంద‌రూ హ‌డావుడిగా ఉన్న స‌మ‌యంలో మెల్లిగా అత్త బ్యాగ్‌లో నుండి ఇంటి తాళం చెవి తీసింది. కుటుంబ స‌భ్యులు కర్మన్ ఘాట్ బ‌య‌లుదేర‌గానే.. తన స్నేహితులు కార్తీక్, అఖిల్ సహాయంతో ఇంట్లోకి వెళ్లి మొత్తం 12 తులాల బంగారం, వెండి వస్తువులు, నగదు దొంగిలించి అక్కడినుండి వెళ్ళిపోయింది. ఆపై కొంత బంగారంపై గోల్డ్ లోన్ తీసుకుని అప్పు తీర్చే ప్రయత్నం చేసింది. అప్ప‌టికే ద‌ర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీటీవి పుటేజ్‌ల‌ ఆధారంగా ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.

Next Story