రెండున్నర నెలల తర్వాత సమాధి నుంచి యువకుడి అస్థిపంజరాన్ని బయటకు తీశారు.. ఏం జరిగిందంటే..
రెండున్నర నెలల క్రితం మృతి చెందిన యువకుడి అస్థిపంజరాన్ని కోర్టు ఆదేశాలతో శనివారం సమాధి నుంచి బయటకు తీశారు.
By Medi Samrat Published on 26 Oct 2024 8:45 PM ISTరెండున్నర నెలల క్రితం మృతి చెందిన యువకుడి అస్థిపంజరాన్ని కోర్టు ఆదేశాలతో శనివారం సమాధి నుంచి బయటకు తీశారు. గ్రామానికి చెందిన యువతితో ప్రేమ వ్యవహారం కారణంగానే యువకుడిని హత్య చేసినట్లు బంధువులు ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఖుదాగంజ్ ప్రాంతంలోని జైతీపూర్ గ్రామానికి చెందిన ఇలియాస్ బేగ్, అతని కుమారుడు మోనిస్ బేగ్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చాలా కాలంగా ఉంటూ పని చేస్తున్నారు. అతని భార్య రుక్కయ్య, చిన్న కుమారుడు షాదాబ్ గ్రామంలో నివసిస్తున్నారు. మోనిస్ మూడు నెలల క్రితం గుజరాత్ నుండి ఇంటికి తిరిగి వచ్చాడు.
గ్రామానికి చెందిన ఓ బాలికతో మోనిస్ అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని.. దీంతో బాలిక తండ్రి, సోదరుడు ఆగ్రహంతో హత్యకు తండ్రీకొడుకులు కుట్ర పన్నారని మృతుడి తండ్రి ఆరోపించారు. ఆగస్టు 10న బాలిక తండ్రి మోనిస్‌కు ఫోన్ చేసి ఇంటికి రావాలని కోరగా వెళ్లిన అతడు ఇంటికి తిరిగి రాలేదు. బంధువులు ఆచూకీ కోసం వెతికినా దొరకలేదు. ఆగస్టు 12న పిలిభిత్‌లోని బిసల్‌పూర్ అటవీ ప్రాంతంలోని పొలంలో మోనిస్ మృతదేహం లభ్యమైంది. తమ కుమారుడి కళ్లను కోసి హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
గుజరాత్ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఇలియాస్ తన కుమారుడి మృతదేహానికి సంబంధించిన ఫోటోలను చూసి యువతి బంధువులు అతడి కళ్లను పీకేసి హత్య చేశారని ఆరోపించారు. చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని.. దీంతో అతడు కోర్టును ఆశ్రయించగా.. ఆ తర్వాత బాలిక సహా ఐదుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని.. శనివారం పోలీసుల సమక్షంలో సమాధి నుంచి అస్థిపంజరాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బంధువులు పట్టుబట్టడంతోనే మృతదేహానికి పంచనామా పూరించి వారికి అప్పగించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.