ఇంటి ముందు చెప్పులు విడిచిపెడుతూ ఉన్నాడని.. ఏకంగా చంపేశారు

Couple booked for killing neighbour who objected to placing footwear at his door. ఇంటి ముందు చెప్పులు విడిచిపెడుతున్నాడనే కారణంతో ఓ జంట పొరుగింటి వ్యక్తిని చంపేసింది.

By M.S.R  Published on  6 March 2023 5:00 PM IST
ఇంటి ముందు చెప్పులు విడిచిపెడుతూ ఉన్నాడని.. ఏకంగా చంపేశారు

ఇంటి ముందు చెప్పులు విడిచిపెడుతున్నాడనే కారణంతో ఓ జంట పొరుగింటి వ్యక్తిని చంపేసింది. ముంబైలో ఈ ఘటన చోటు చేసుకుంది. మీరా రోడ్‌ ప్రాంతంలో ఉంటున్న ఓ జంటకు ఎదురింటి వ్యక్తి తమ ఇంటి ముందు చెప్పులు విడిచిపెట్టడం ఇష్టం లేదు. దీంతో ఆ జంట పొరుగింటి వ్యక్తిని చంపేసింది. పోలీసులు జైనాబ్ రూపాని అనే మహిళను అరెస్ట్ చేసి, పరారీలో ఉన్న భర్త సమీర్ కోసం గాలిస్తున్నారు. అఫ్జర్ ఖత్రీ అనే వ్యక్తి ఆదివారం ఉదయం భార్యాభర్తల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు.

నయా నగర్ పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, అస్మిత డాఫోడిల్స్ బిల్డింగ్‌లోని బి వింగ్‌లో ఉంటున్న అఫ్జర్ ఖత్రీ రాత్రి 8 గంటలకు కార్యాలయం నుండి ఇంటికి తిరిగి వచ్చాడు. అఫ్జర్ ఖత్రీ జైనాబ్ ఇంటి ముందు ఉన్న తన బూట్లను తీయడానికి నిరాకరించాడు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో రూపానీ దంపతులు అఫ్జర్ ఖత్రీని ఇష్టమొచ్చినట్లు కొట్టారు. ఈ ఘటనతో అతని శరీరమంతా గాయాలు అయ్యాయని మీరా రోడ్ పోలీస్ స్టేషన్ కు చెందిన అధికారి తెలిపారు. ఇరుగుపొరుగువారు, కుటుంబ సభ్యుల జోక్యంతో ఖత్రీ, రూపాని మధ్య వాగ్వాదం, గొడవ సద్దుమణిగింది.

“ఆదివారం, ఖత్రీ తన కుటుంబం కోసం టమోటాలు, ఫలూడా కొనడానికి తన ఇంటి నుండి బయటికి వచ్చాడు. తిరిగి రాగానే ఇంట్లో కుప్పకూలి చనిపోయాడు” అని అధికారి తెలిపారు. ఖత్రీని వెంటనే లైఫ్‌లైన్ ఆసుపత్రికి తరలించగా, అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. "భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 కింద జైనాబ్‌ను హత్యానేరం కింద అరెస్టు చేసాము. సమీర్ ఇంట్లో లేనందున అతనిని వెతుకుతున్నాము" అని డిప్యూటీ పోలీస్ కమిషనర్ (మీరా రోడ్) జయంత్ బజ్బలే తెలిపారు. ఖత్రీ మృతికి గొడవే కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story