Constable Suspended By SP. పోలీసు ప్రతిష్టను భ్రష్టు పట్టించేలా సిబ్బంది వ్యవహరిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని జిల్
By Medi Samrat Published on 31 July 2021 9:59 AM GMT
పోలీసు ప్రతిష్టను భ్రష్టు పట్టించేలా సిబ్బంది వ్యవహరిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ హెచ్చరించారు. అసభ్యకర ప్రవర్తన కలిగిన కానిస్టేబుల్ పై సస్పెన్షన్ విధిస్తూ.. ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. గంపలగూడెం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న రామకృష్ణ అనే కానిస్టేబుల్ ఇసుక చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. అయితే.. కొంత కాలంగా అధికారుల అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యాడు.
విధుల పట్ల అలసత్వం వహించడమే కాక.. ఆ ప్రాంత మహిళా వీఆర్వో, ఆమె తల్లి పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఇబ్బందిపాలు చేస్తున్నాడని ఎస్పీ దృష్టికి రాగా.. అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఫిర్యాదుపై విచారణ జరిపి నివేదిక పంపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు విచారణ జరిపి నివేదికను ఎస్పీకి పంపగా.. శనివారం అతనిపై సస్పెన్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సిబ్బంది ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యం, ప్రజలతో అసభ్యంగా ప్రవర్తించడం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొవడం లాంటివి జరిగి.. నిర్ధారణ అయితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.