మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. చత్తార్పూర్ జిల్లాలో గువారా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కాంగ్రెస్ నేత ఇంద్ర ప్రతాప్ సింగ్ పర్మార్‌ను ఛాతీపై కాల్చి.. అక్కడి నుంచి పరారయ్యారు. ఓ హోటల్ ముందు తన మిత్రులతో కలిసి ఇంద్ర ప్రతాప్ సింగ్ పర్మార్ నిల్చొని ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఛాతీపై కాల్చడంతో అతడికి తీవ్ర రక్తస్రావమైంది. దీంతో వెంటనే అక్కడున్న స్థానికులు అతనిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే కాంగ్రెస్ నేత ఇంద్ర ప్రతాప్ సింగ్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. జరిగిన ఘటన మొత్తం కూడా స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.
ప్రస్తుతం ఈ వీడియో ఫుటేజీ వైరల్‌గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మొత్తం ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే హత్యకు కారణంగా పాతకక్షలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. కాంగ్రెస్ నేత ఇంద్ర ప్రతాప్ హత్యతో అతని అనుచరులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇంద్ర ప్రతాప్‌ను చేర్చిన ఆస్పత్రిలో ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి అల్లర్లు సృష్టించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ కమల్‌నాథ్, ఎంపీ దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు.