భార్య చెల్లెలిపై కన్నేసిన బావ.. ఆమె దక్కలేదని దారుణం

Chittoor Petrol Attack. బంధాలు మ‌రిచి మానాన్ని చెరిచే మృగాలు పెరిగిపోతున్నాయి.

By Medi Samrat  Published on  18 Dec 2020 9:55 AM GMT
భార్య చెల్లెలిపై కన్నేసిన బావ.. ఆమె దక్కలేదని దారుణం

బంధాలు మ‌రిచి మానాన్ని చెరిచే మృగాలు పెరిగిపోతున్నాయి. బాధ్య‌త‌గా ఉండాల్సిన ఓ బావ‌.. భార్య చెల్లెలిపై క‌న్నేసి ఆమెను సొంతం చేసుకోవాల‌నుకున్నాడు. చివ‌ర‌కి ఆమె చేజారిపోతోంద‌ని తెలిసి అంతమొందించేందుకు కూడా వెనకాడలేదు. పక్కా పథకం ప్రకారం వచ్చి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. పూర్తిగా కాలిన శ‌రీరంతో ఆ అభాగ్యురాలు హాస్పిట‌ల్ బెడ్‌పై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఈ అమాన‌వీయ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.

ముల‌క‌లచెరువు మండ‌లం గ‌ట్టుకింద‌ప‌ల్లెకు చెందిన క‌దిరి శివ‌న్న‌, న‌ర‌స‌మ్మ దంప‌తుల‌కు ముగ్గురు కుమార్తెలు. వారి రెండో కుమార్తె మాధ‌విని క‌ర్ణాట‌క రాష్ట్రం బేళూరుకు చెందిన వెంక‌టేశ్‌కు ఇచ్చి తొమ్మిదేళ్ల కింద‌ట వివాహం చేశారు. వెంక‌టేశ్‌-మాధ‌వి దంప‌తుల‌కు ఒక కుమారుడు. శివ‌న్న మూడో కుమార్తె సుమ‌తి ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో న‌ర్స్‌గా ప‌నిచేస్తోంది. మరదలిపై కన్నేసిన వెంక‌టేశ్ ఆమెని ఎలాగైనా సొంతం చేసుకోవాల‌నుకున్నాడు. భార్య బ‌తికుండ‌గానే సుమ‌తిని రెండో వివాహం చేసుకుంటాన‌ని, పెళ్లంటూ చేసుకుంటే న‌న్నే చేసుకోవాల‌ని వెంక‌టేశ్ సుమ‌తిని రోజూ వేధించేవాడు. ఈ మాన‌సిక క్షోభ త‌ట్టుకోలేని సుమ‌తి ఆత్మ‌హ‌త్యా య‌త్నానికి పాల్ప‌డింది. ఈ విష‌యం పోలీసుల దాకా వెళ్ల‌డంతో వెంక‌టేశ్‌కు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

ముహూర్తాలు పెట్ట‌కున్నార‌ని తెలిసి..

పంచాయితీ పోలీస్ స్టేష‌న్ వ‌ర‌కు వెళ్ల‌డంతో త‌న భార్య‌, బిడ్డ‌ను వెంకటేష్ అత్త‌ింటి వద్దే వదిలేశాడు. త‌ల్లిదండ్రులు సుమతికి వివాహం నిశ్చయించారు. ఈ నెల 25వ తేదీ వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి విష‌యం తెలుసుకున్న వెంక‌టేశ్ మరదలిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. పక్కా ప్లాన్ రచించాడు. ఇంట్లో కుక్కలు అరవకుండా విషం క‌లిపిన అన్నం చ‌ల్లాడు. ఆ అన్నం తిని మూడు కుక్క‌లు, ఒక పిల్లి చనిపోయాయి. తెల్ల‌వారుజామున మూడు గంట‌ల స‌మ‌యంలో నిద్ర‌పోతున్న సుమ‌తిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. సుమ‌తి కేక‌ల‌కు మేల్కొన్న కుటుంబ స‌భ్యులు, చుట్టుప‌క్క‌ల వాళ్లు మంట‌ల‌ను ఆర్పారు. ఆమెను 108లో తంబ‌ళ్ల‌ప‌ల్లె పీహెచ్‌సీకి.. అక్క‌డి నుంచి మెరుగైన చికిత్స కోసం తిరుప‌తికి తీసుకెళ్లారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.


Next Story
Share it