తోటి విద్యార్ధిని రాళ్లతో కొట్టి చంపి.. కాలువలో పడేశారు.. కారణమేమిటంటే..
Caught smoking, Class 8 students bludgeon classmate to death in Delhi's Badarpur. సౌత్ ఈస్ట్ ఢిల్లీ జిల్లా బదర్‌పూర్‌లోని మోల్డ్‌బాండ్ ప్రాంతంలో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 29 April 2023 12:38 PM IST
సౌత్ ఈస్ట్ ఢిల్లీ జిల్లా బదర్‌పూర్‌లోని మోల్డ్‌బాండ్ ప్రాంతంలో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాలకు వెళ్లిన 12 ఏళ్ల బాలుడిని తోటి విద్యార్థులు రాళ్లతో కొట్టి చంపి.. మృతదేహాన్ని కాలువలో పడేశారు. మృతి చెందిన బాలుడిని సౌరభ్‌గా గుర్తించారు. మృతుడు తాజ్‌పూర్ పహారీలోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. సౌరభ్ తల్లిదండ్రులకు ఏకైక మగ సంతానం. ఈ కేసులో ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో స్కూల్‌లో ఓ విద్యార్ధి సిగరెట్ తాగుతుండగా చూసిన సౌరభ్.. విషయం టీచర్‌కు చెబుతానని బెదిరించగా.. నిందితులు ఆగ్రహంతో హత్య చేసినట్లు తేలింది. స్కూల్‌లోని కొందరు విద్యార్థులు తన కొడుకును వేధించేవారని.. తరగతిలో రకరకాల డ్రగ్స్ తాగేవారని సౌరభ్ తల్లిదండ్రులు చెప్పారు. సౌరభ్‌కి కొత్త సెక్షన్ నచ్చకపోవడంతో టీచర్లను కూడా తన సెక్షన్ మార్చమని కోరాడు. అయితే ఇతర సెక్షన్‌లలో ఖాళీ లేకపోవడంతో మార్పు సాధ్యం కాలేదు.
సౌరభ్ గురువారం పాఠశాలకు వెళ్లాడు. సాయంత్రం వరకు ఇంటికి రాలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించాం. ఆ తర్వాత సౌరభ్ మృతదేహంపై తమకు సమాచారం అందిందని తల్లిదండ్రులు తెలిపారు.
డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ రాజేష్ దేవ్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 27, రాత్రి 8.20 గంటల సమయంలో ఇద్దరు బాలురు బాదర్‌పూర్‌లోని మోలాద్‌బండ్, ఖతుష్యమ్ పార్క్ సమీపంలోని కాలువలో ఒక చిన్నారిని చంపి పడేసినట్లు బదర్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఖతుశ్యాం పార్క్, తాజ్‌పూర్ రోడ్ గ్రామం మధ్య ఉన్న డ్రెయిన్‌లో 12-13 ఏళ్ల చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం కాలువలో మునిగిపోయింది. మృతదేహం దగ్గర స్కూల్ బ్యాగ్ కనిపించగా, దానికి కొద్ది దూరంలో రక్తపు మరకలున్న నాలుగైదు రాళ్లు, తెల్లటి గుడ్డ కూడా పడి ఉన్నాయి. ఘటనా స్థలం నుంచి క్రైమ్ టీమ్ ఆధారాలను సేకరించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌరభ్ తలపై రాళ్లతో తీవ్రంగా కొట్టారు. సౌరభ్ హత్యకు నిరసనగా.. స్థానిక ప్రజలు సుమారు నాలుగు-ఐదు గంటలపాటు ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు. నిరసన కారణంగా ఈ మార్గంలో వెళ్లే ప్రజలు ట్రాఫిక్ జామ్‌తో ఇబ్బందులు పడాల్సి వచ్చింది.