మృతదేహంతో 120 కి.మీ ప్ర‌యాణించిన బ‌స్సు.. పక్కన కూర్చున్న వ్యక్తికి కూడా తెలియ‌దు..!

Bus Kept Moving With Dead Body For 120 KM. రాంచీ నుంచి ఔరంగాబాద్‌కు వెళ్తున్న‌ ప్యాసింజర్ బస్సులో ఒకే సీటులో కూర్చున్న ఇద్దరు

By Medi Samrat  Published on  29 May 2023 1:49 PM GMT
మృతదేహంతో 120 కి.మీ ప్ర‌యాణించిన బ‌స్సు.. పక్కన కూర్చున్న వ్యక్తికి కూడా తెలియ‌దు..!

రాంచీ నుంచి ఔరంగాబాద్‌కు వెళ్తున్న‌ ప్యాసింజర్ బస్సులో ఒకే సీటులో కూర్చున్న ఇద్దరు ప్రయాణికుల్లో ఒకరు మృతి చెందగా, పక్కనే కూర్చున్న తోటి ప్రయాణికుడికి ఆ విషయం తెలియలేదు. సీటులో కూర్చున్న ఓ వ్యక్తి పేరు మహేంద్ర. మృతదేహంతో సుమారు 120 కి.మీ ప్రయాణించాడు. ఆయ‌న‌ ప‌క్క‌నే కూర్చున్న రితేష్ కుమార్ శర్మ ఇక లేడనే విష‌యం మ‌హేంద్ర‌కు తెలియదు.

రితేష్ కళ్ళు మూసుకున్నాడు. దీంతో అతను నిద్రపోతున్నాడని మహేంద్ర అనుకున్నాడు. ఇద్దరూ ఔరంగాబాద్‌కు 120 కి.మీ ముందు లైన్ హోటల్ వ‌ద్ద‌ దిగి భోజనం చేశారు. భోజనం చేసి ఇద్దరూ బస్సులో కూర్చున్నారు. ఔరంగాబాద్ నగరంలోని బైపాస్ బస్టాండ్ వద్దకు బస్సు రాగానే ప్రయాణికులంతా కిందకు దిగగా రితేష్ ఇంకా పడుకునే ఉన్నాడు. బస్సు సిబ్బంది అతడిని చూసి ఊపినా చలనం లేదు. బస్సు సిబ్బంది రితేష్‌ను వెంట‌నే సదర్‌ ఆస్పత్రికి తరలించారు. సదర్ ఆసుపత్రి వైద్యులు చూసి అప్ప‌టికే రితేష్‌ మృతి చెందినట్లు ప్రకటించారు. పోలీసుల‌కు స‌మాచారం అందించ‌గా.. మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్టుమార్టంకు త‌ర‌లించారు.

బస్ బ్యాగ్‌లో లభించిన స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ ఆధారంగా రితేష్‌ని గుర్తించారు. రితేష్ (31) జామ్‌హోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోర్దిహరి గ్రామ నివాసి. బ్యాగ్‌లో దొరికిన ఆధార్ కార్డ్‌లోని చిరునామా ఆధారంగా అతను ముంబైలో పని చేస్తున్నాడ‌ని తెలిసింది.

మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆర్తి కుమారి తెలిపారు. బ్యాగ్‌లో స్కూల్ సర్టిఫికేట్ లభించడంతో బంధువులకు జమ్‌హోర్ పోలీస్ స్టేషన్ ద్వారా సమాచారం అందించిన‌ట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు.


Next Story