షాకింగ్.. స్నేహితుడిని పొడిచి చంపిన 11 ఏళ్ల బాలుడు

కర్ణాటక లోని హుబ్బళ్ళిలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

By Medi Samrat
Published on : 13 May 2025 8:15 PM IST

షాకింగ్.. స్నేహితుడిని పొడిచి చంపిన 11 ఏళ్ల బాలుడు

కర్ణాటక లోని హుబ్బళ్ళిలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం కమరిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గొడవలో 14 ఏళ్ల బాలుడిని అతని 11 ఏళ్ల స్నేహితుడు పొడిచి చంపాడు. మృతుడిని చేతన్‌గా గుర్తించారు. ఇద్దరూ ఎదురెదురు ఇళ్లల్లో ఉంటారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇద్దరు బాలురు క్రమం తప్పకుండా కలిసి ఆడుకునేవారని తెలిసింది. సోమవారం, వారి మధ్య చిన్న గొడవ జరిగినట్లు సమాచారం. కోపంతో ఆ 11 ఏళ్ల బాలుడు ఇంటికి వెళ్లి, కత్తిని తీసుకుని వచ్చి చేతన్‌ను పొడిచాడు. చేతన్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని KMC-RI ఆసుపత్రికి తరలించారు, అయితే అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారు.

మీడియాతో మాట్లాడిన పోలీస్ కమిషనర్ ఎన్. శశికుమార్ ఈ సంఘటన తీవ్ర కలకలం రేపిందని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, భావోద్వేగాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. కామరిపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితుడిని జువెనైల్ జస్టిస్ బోర్డు (జెజెబి) ముందు హాజరుపరిచి బాలమందిర్‌కు పంపారు. తదుపరి దర్యాప్తు జరుగుతోంది.

Next Story