పాట్నా: బీహార్‌లోని సివాన్‌లో బీజేపీ నేతను కొందరు దుండగులు కాల్చిచంపారు. అతడిని హత్య చేసిన తర్వాత, నేరస్థులు ఆయుధాలు ఊపుతూ, గాలిలోకి కాల్పులు జరుపుతూ పారిపోయారు. బీజేపీ నేత దుకాణదారుడైన జనార్దన్ సింగ్ ఛాతీపై దుండగులు కాల్పులు జరిపినట్లు సమాచారం. స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం సదర్ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి వైద్యులు పాట్నాకు తరలించారు. ఆపై తీవ్రగాయాలతో పాట్నాకు తీసుకెళుతూ ఉండగా అమనూర్ సమీపంలో మృతి చెందాడు. బుధవారం తెల్లవారుజామున దుండగులు అతడి ఇంట్లోకి వెళ్లి కాల్చిచంపారు.
బుధవారం ఉదయం జామో పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్‌పూర్ గ్రామంలో దుకాణదారుడు, బీజేపీ నాయకుడు తన సొంత ఇంటి తలుపు వద్ద నిలబడి ఉన్నాడు. అదే సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఒక్కసారిగా అతడి ఛాతీపై కాల్చారు. గ్రామంలో వీధుల్లో తిరుగుతూ గాల్లోకి కాల్పులు జరిపి నేరస్థులు అక్కడి నుండి పారిపోయారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. హత్యాకాండతో ఆ ప్రాంత ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. కాల్చి చంపిన తర్వాత నేరస్థులు మోటార్‌సైకిల్‌పై ఎలా తప్పించుకున్నారో ఇందులో చూడవచ్చు. ఒక వ్యక్తి చేతిలో గొడ్డలితో వారి వెంట పరుగెత్తుతున్నట్లు వీడియోలో ఉంది.