విషపు ఇంజక్షన్ ఇచ్చి బీజేపీ నేతను హత్య చేసిన దుండగులు
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో బీజేపీ నేత గుల్ఫామ్ సింగ్ యాదవ్ (65)ను విషపు ఇంజక్షన్ ఇచ్చి హత్య చేశారు.
By Medi Samrat Published on 11 March 2025 10:34 AM IST
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో బీజేపీ నేత గుల్ఫామ్ సింగ్ యాదవ్ (65)ను విషపు ఇంజక్షన్ ఇచ్చి హత్య చేశారు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది. ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు మోటార్‌సైకిల్‌పై వచ్చి గుల్ఫామ్ కు ఇంజక్షన్ ఇచ్చి వెళ్లిపోయారు. ఆయన గొంతు విని కుటుంబ సభ్యులు వచ్చి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఈ కేసు యూపీలోని సంభాల్ జిల్లా జున్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని దబ్తారా గ్రామంలో నమోదైంది. మధ్యాహ్నం 1:30 గంటలకు బీజేపీ నాయకుడు గుల్ఫామ్ యాదవ్ ఇంట్లో ఉన్న సమయంలో ముగ్గురు గుర్తు తెలియని యువకులు అతనిని కలవడానికి వచ్చి అతనితో మాట్లాడారు. అనంతరం అతడి కడుపుకు బలవంతంగా విషపు ఇంజక్షన్ వేశారు. అనంతరం వారు ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. ఇంజెక్షన్ వేసిన తర్వాత గుల్ఫామ్ బాధపడుతుండటంతో.. అతడి అరుపులు విని చుట్టుపక్కల ప్రజలు, వారి కుటుంబ సభ్యులు అక్కడకు వచ్చారు.
ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్ఫామ్‌ను వెంటనే చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉండటంతో అలీఘర్ మెడికల్‌కు రిఫర్ చేశారు. మార్గమధ్యంలో బీజేపీ నేత మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి ఎస్పీ కృష్ణ కుమార్ విష్ణోయ్ మాట్లాడుతూ.. ఓ వ్యక్తికి బలవంతంగా విషపు ఇంజక్షన్ ఇచ్చినట్లు పోలీసులకు సమాచారం అందిందని తెలిపారు. దీని కారణంగా ఆయన మరణించాడని పేర్కొన్నారు.
ఈ విషయమై పోలీసులు విచారణ ప్రారంభించారు. సమీపంలోని సీసీటీవీలను స్కాన్ చేయగా.. పోలీసులకు కొన్ని ఆధారాలు కూడా లభించాయి. ఘటనకు పాల్పడిన వ్యక్తులను త్వరలో అరెస్టు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. గుల్ఫామ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. దీని ద్వారా ఆయన మృతికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
2004లో జరిగిన ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్‌పై బీజేపీ నేత గుల్ఫామ్ యాదవ్ గున్నౌర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 2016 సంవత్సరంలో ఆయన పశ్చిమ ఉత్తరప్రదేశ్ బిజెపి ప్రాంతీయ ఉపాధ్యక్ష పదవిని కూడా నిర్వహించారు. ఆయన బీజేపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యునిగా పని చేశారు.