బీహార్‌లోని జాముయ్ జిల్లాలో పోలీసు కస్టడీలో ఉన్న తన భర్తను విడిపించుకునేందుకు ఓ మహిళ తాను దుర్గాదేవినని చెప్పుకుంది. ఒక చేత్తో బియ్యం, మరో చేత్తో కర్ర పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు వచ్చి పోలీసులను ఎంతగానో ఇబ్బంది పెట్టింది. తాగుడుకు బానిసైన సంజూదీవి భర్త కార్తీక్ సికంద్రా బ్లాక్‌లోని లచ్చువార్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడు. అతడిని ఎలాగైనా విడిపించుకోవాలని నిర్ణయించుకున్న సంజూదేవి ఓ చేతిలో కర్ర, మరో చేతిలో బియ్యం పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. తనలో దుర్గామాత ఉందని.. తన భర్తను కాపాడుకోవడానికి వచ్చానని చెప్పడంతో పోలీసు స్టేషన్ లో ఉన్న అందరూ షాకయ్యారు. పట్టుకొచ్చిన కర్రను ఊపుతూ మంత్రాలు పఠిస్తున్నట్టు నటిస్తూ బియ్యం గింజలను పోలీసులు, సిబ్బందిపైకి విసిరింది.
దీంతో పోలీసుల్లో మరింత భయం పట్టుకుంది. దాదాపు గంటపాటు ఈ తతంగం నడిచింది. చివరికి మహిళా కానిస్టేబుళ్లు ఆమెను అడ్డుకుని.. నిన్ను కూడా అరెస్ట్ చేస్తామని చెప్పడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ మహిళ తరచూ తన గ్రామంలో దుర్గాదేవిగా నటిస్తుందని చెబుతూ వచ్చారు. ఈ ఏడాది జనవరిలో సికంద్రా పోలీస్‌స్టేషన్ పరిధిలోని లచ్చువార్ గ్రామంలో ఇలాంటి ఘటనే జరిగినట్లు వార్తలు వచ్చాయి. పోలీసుల బృందంపై తనను తాను దుర్గగా చెప్పుకున్న ఓ మహిళ దాడి చేసింది. ఆమె త్రిశూలంతో దాడి చేసింది. అనంతరం ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.