ఫ్లాస్క్ పగలగొట్టారని పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన దంపతులు
Bengaluru Police Arrest Husband, Wife for Stealing 230 Traffic Signal Batteries. సికందర్ కు కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ టీ దుకాణం ఉండేది.. కానీ కరోనా మహమ్మారి కారణంగా
By Medi Samrat Published on 18 Feb 2022 11:31 AM IST
సికందర్ కు కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ టీ దుకాణం ఉండేది.. కానీ కరోనా మహమ్మారి కారణంగా తలెత్తిన సంక్షోభం కారణంగా ఆ దుకాణాన్ని మూసి వేయాల్సి వచ్చింది. దీంతో తర్వాత స్కూటర్‌పై టీ అమ్మడం మొదలుపెట్టాడు. అయితే అతడు ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడంతో అతడిని కొందరు ట్రాఫిక్ పోలీసులు టార్గెట్ చేశారు. ట్రాఫిక్ పోలీసులు అతడిని పలు మార్లు పట్టుకోడానికి ప్రయత్నించారు కూడానూ..! ఓ సారి వారితో అతడికి చిన్నపాటి వాగ్వివాదం చోటు చేసుకోవడంతో బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు అతని ఫ్లాస్క్‌ని పగలగొట్టారు. దీంతో కోపోద్రిక్తుడైన సికందర్ ట్రాఫిక్ పోలీసులను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని భావించాడు.
ఇక ఇటీవలి కాలంలో బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ బ్యాటరీలను కొట్టేస్తున్నారు. బెంగళూరు నగరంలో ట్రాఫిక్ లైట్ల నుండి బ్యాటరీ దొంగతనాలు జరుగుతున్న సంఖ్య ఇటీవలి కాలంలో పెరగడంతో పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. చివరికి కేసును చేధించగా నిందితుల గురించి తెలుసుకుని వారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ దొంగతనాలకు పాల్పడింది ఓ జంట. చిక్కబాణవరానికి చెందిన ఎస్ సికందర్ (30) కే ఈ పనికి పాల్పడ్డాడు. అతని భార్య నజ్మా సికందర్ (29) భర్తకు సహాయం చేసినట్లు నిర్ధారించారు.
సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య దంపతులు స్కూటర్‌పై తిరుగుతున్నట్లు గుర్తించారు. వాహనం రిజిస్ట్రేషన్ సమాచారాన్ని కెమెరాలు గుర్తించకుండా తమ స్కూటర్ టెయిల్ లైట్లను ఆఫ్ చేసి, ట్రాఫిక్ సిగ్నల్ బ్యాటరీలను దొంగిలించే వారు. ఈ జంట జూన్ 2021లో ట్రాఫిక్ సిగ్నల్ బ్యాటరీలను దొంగిలించడం మొదలుపెట్టారు. డబ్బు సంపాదించడానికి వారు ఆ బ్యాటరీలను జంక్‌గా విక్రయించేవారు. ఇటీవలి నెలల్లో 68 ట్రాఫిక్ కూడళ్ల నుంచి దొంగిలించిన 230 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. కరెంట్ పోయిన సమయంలో ఈ బ్యాటరీల సహాయంతో ట్రాఫిక్ సిగ్నల్స్ పని చేస్తాయి.