దేశంలో ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా రోజురోజుకు హింస పెరుతూనే ఉంది. నేరస్థులు పుట్టుకొస్తూనే ఉన్నారు. నడి రోడ్డుపై నరికి చంపడం, బతికివున్న మనిషిని కారుతో ఢీకొట్టి చంపడం ఇటీవల మనం చూశాం. ఇవేకాక ఎన్నో ఘోరాలను చూస్తూన్నాం. అయితే.. రౌడీయిజం కట్టడికి పోలీసులు పకడ్భందీ చర్యలు చేపడుతున్నా.. యధేచ్చగా వేట కత్తులతో తిరుగుతున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
వివరాళ్లోకెళితే.. కర్ణాటకలోని మార్తహల్లి పోలీసు స్టేషన్ పరిధిలో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మంగళవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇద్దరు రౌడీషీటర్లు ప్రయాణిస్తున్న రెండు కార్లు పట్టుబడ్డాయి. దీంతో కార్లను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వారితో పాటు మరో 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఆ కార్లలో పోలీసులు 18 వేట కత్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారు కత్తులను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎందుకు తీసుకెళ్తున్నారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకేసారి పెద్దఎత్తున్న వేట కత్తులు, రౌటీ షీటర్లు పట్టుబడటంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.