పశ్చిమ బెంగాల్‌లో రూ. 500 అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో 40 ఏళ్ల వ్యక్తిని అతని పొరుగింటి వ్యక్తి కొట్టి చంపాడు. ఈ ఘటన మాల్దా జిల్లాలోని బమోంగోలా పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగాప్రసాద్ కాలనీలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. బన్మాలి ప్రమాణిక్ అనే మృతుడు తన పొరుగున ఉన్న ప్రఫుల్లా రాయ్ నుంచి రూ.500 అప్పుగా తీసుకున్నాడు. ప్రమాణిక్ నిర్ణీత గడువులోగా డబ్బును తిరిగి ఇవ్వడంలో విఫలమయ్యాడు. ఇది ప్రఫుల్లా రాయ్ తో విభేదాలకు దారితీసి గొడవలకు కారణమయ్యింది.
ఆదివారం సాయంత్రం డబ్బు కావాలని ప్రఫుల్లా రాయ్.. ప్రమాణిక్ ఇంటికి చేరుకున్నాడు. ఇంటి దగ్గర దొరక్కపోవడంతో ప్రమాణిక్ కోసం వెతుకుండగా.. స్థానిక టీ దుకాణంలో కనిపించాడు. ప్రఫుల్లా రాయ్.. ప్రమాణిక్ ను నగదు అడిగాడు.. అతడు ఇవ్వలేదు. దీంతో వెదురు కర్రతో ప్రామాణిక్‌ని కొట్టడం ప్రారంభించాడు. "నా సోదరుడు గంగాప్రసాద్ కాలనీలో తన స్నేహితులతో కూర్చున్నప్పుడు రాయ్ వచ్చి కొట్టడం ప్రారంభించాడు" అని మృతుడి సోదరుడు అజయ్ ప్రమాణిక్ చెప్పారు.
ప్రమాణిక్ తలపై దెబ్బ తగిలి కుప్పకూలినట్లు ప్రత్యక్ష సాక్షులు కూడా పేర్కొన్నారు. అయితే.. అతను ఆ తర్వాత స్పృహలోకి వచ్చి ఇంటికి చేరుకున్నాడు. మరుసటి రోజు.. బన్మాలి ప్రమాణిక్‌కు రక్తంతో వాంతులు అవడంతో కుటుంబ సభ్యులు అతన్ని స్థానిక ముదిపుకూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతన్ని మాల్దాకు రెఫర్ చేశారు. మాల్దాకు తీసుకురాగానే అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారని అతని సోదరుడు చెప్పాడు.
మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబీకులు నిందితులపై బామన్ గోలా పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిందితుడిని గుర్తించి అరెస్టు చేసినట్లు బామన్ గోలా పోలీసులు తెలిపారు.