టిఫిన్ లో ఉప్పు ఎక్కువగా వేసిందని ఒక వ్యక్తి తన 40 ఏళ్ల భార్యను హతమార్చాడు. మహారాష్ట్రలోని థానే జిల్లా భయాందర్ టౌన్‌షిప్‌లోని వారి నివాసంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆమె తయారు చేసిన అల్పాహారంలో ఉప్పు ఎక్కువ ఉందనే కోపంతో హత్య చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం భయాందర్ ఈస్ట్‌లోని ఫటక్ రోడ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఘటన తరువాత పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
నిందితుడిని నీలేష్ ఘాగ్ (46)గా గుర్తించారు. ఆ వ్యక్తి ఉదయం 9.30 గంటల ప్రాంతంలో తన భార్య నిర్మలని గొంతు కోసి చంపాడు. ఆమె వండిన 'ఖిచాడీ'లో ఉప్పు ఎక్కువ ఉండటంతో కోపోద్రిక్తుడై భార్యను హత్య చేశాడని మీరా భయందర్-వసాయి విరార్ పోలీసు కమిషనరేట్ అధికారి తెలిపారు. విషయం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. ఈ హత్యకు మరేదైనా కారణం ఉందా అని పోలీసులు ఆరాతీస్తున్నారు. భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 302 (హత్య) కింద ఆ వ్యక్తిపై భయాందర్‌లోని నవ్‌ఘర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది.