హైదరాబాద్‌లో బాలుడిపై దగ్గరి బంధువు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలుడిపై అఘాయిత్యానికి ఒడిగట్టడమే కాకుండా.. తన మాజీ ప్రియుడితో కలిసి వీడియో తీసింది. ఆ తర్వాత బాలుడిని బెదిరింపులకు గురి చేసింది. బాధితుడి ఇంట్లోని బంగారం, నగదును దోచుకెళ్లింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత 14 ఏళ్ల బాలుడు 9వ తరగతి చదువుతున్నాడు. ఇటీవల బాలుడి కుటుంబం టోలిచౌకి నుండి జూబ్లీహిల్స్‌కు ఇళ్లు మారారు. ఈ సమయంలో అల్మారాలోని ఉన్న 20 తులాల బంగారం కనిపించలేదు. ఎంత వెతికినా దొరక్కపోవడంతో బాలుడిని తల్లి ప్రశ్నించింది. ఈ క్రమంలోనే బంగారాన్ని బెంగళూరులో నివసించే తండ్రి బంధువుకు ఇచ్చానని చెప్పాడు.
ఆమెకు ఎందుకు ఇచ్చావని తల్లి ప్రశ్నించగా.. గతంలో స్కూల్ దగ్గరకు వచ్చి తనను చార్మినార్‌లోని లాడ్జ్‌కు తీసుకెళ్లిందని తెలిపాడు. అక్కడే తనపై లైంగిక దాడికి పాల్పడి, మాజీ ప్రియుడితో కలిసి వీడియో తీసి బెదిరించిందని చెప్పాడు. దీంతో ఇంట్లోని 20 తులాల బంగారం, రూ.6 లక్షలు బంధువుకు ఇచ్చానని బాలుడు చెప్పాడు. ఇదే విషయమై బాలుడి తల్లి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కొడుకుపై ఆమె 3 సార్లు లైంగిక దాడికి పాల్పడిందని చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. కాగా నిందితురాలిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడిపై అఘాయిత్యం జరిగి మూడేళ్లు అయ్యిందని పోలీసులు తెలిపారు.