ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో బుద్‌సేన్ (55) అనే హోంగార్డుకు ముగ్గురు కుమారులు. అతడి కుటుంబంలో ఆస్తి పంపకాల విషయంలో గొడవ జరిగింది. చిన్న కుమారుడు నెక్‌పాల్ ఆస్తి వాటా విషయంలో అసంతృప్తిగా ఉన్నాడు. తనకు ఎక్కువగా ఆస్తి ఇవ్వకపోవడంతో తండ్రిపై కోపం పెంచుకుని హతమార్చాలని అనుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున నిద్రిస్తున్న తండ్రిని ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు. అనంతరం సోమవారం ఉదయం పోలీసులకు ఫోన్ చేసి 'నా తండ్రిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు సార్..' అని చెప్పాడు. హుటాహుటిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకోగా అప్పటికే నెక్‌పాల్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.
అయితే బుద్ సేన్ చనిపోయిన 2 గంటల్లోనే నెక్ పాల్ చనిపోయాడనే వార్త వచ్చింది. నివాసానికి 2 కిలోమీటర్ల దూరంలో నెక్‌పాల్ మృతదేహం లభ్యమైంది. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా నెక్‌పాల్ మృతదేహమని నిర్ధారించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం తండ్రి, కుమారుడి మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం స్థానికంగా ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
నెక్ పాల్ ఎలా చనిపోయాడంటే :
ఆస్తి పంపకాల విషయంలో తండ్రి.. పెద్ద కుమారుడైన ఓం ప్రకాష్‌కు ఎక్కువగా ఇచ్చాడు. దీంతో చిన్నకుమారుడైన నెక్‌పాల్ తండ్రిపైన కోపం పెంచుకున్నాడు. నెక్‌పాల్ తండ్రిని ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి ఇంట్లో నుంచి వెళ్లిపోతున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో నెక్‌పాల్ మరణించాడు. అతను రోడ్డు ప్రమాదంలో చనిపోయాడా లేక ఆత్మహత్య చేసుకున్నాడా.. అనేది నిర్ధారించాల్సి ఉందని పోలీసులు తెలిపారు.