తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రేణిగుంట- నాయుడుపేట ప్రధాన రహదారిపై టెంపో వాహనం లారీని ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి చంద్రగిరికి చెందిన 12 మంది నాయుడుపేట సమీపంలోని కనుపూరుమ్మ ఆలయాన్ని దర్శించుకుని టెంపో వాహనంలో తిరుపతి బయల్దేరారు. శ్రీకాళహస్తిలోని అర్ధనారీశ్వర స్వామి ఆలయం సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీని టెంపో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో అర్జునయ్య, సరసమ్మ దంపతులతో పాటు కావ్య మృతి చెందారు.
టెంపోలో ఉన్న గోపి, ఢిల్లీ రాణి, కవిత, ఆనంద్, శ్రీనివాసులుతో పాటు నలుగురు పిల్లలు భవీఫ్, ధరణి, మోక్షిత, ధనుష్‌లకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందించారు. మెరుగైన చికిత్స కోసం అనంతరం వారిని తిరుపతికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదం జరగడంతో ఏర్పడిన ట్రాఫిక్ రద్దీని నియంత్రించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.