కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనుమంచిపల్లి వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో సుమారు 35మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వారందరిని చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులు విశాఖ, ఒడిశాకు చెందినవారిగా గుర్తించారు. బస్సు విశాఖ నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జగినట్లు ప్రయాణీకులు చెబుతున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఉదయభాను మాట్లాడుతూ.. బస్సులో ఎంతమంది ప్రయాణిస్తున్నారనే దానిపై డ్రైవర్ దగ్గర కనీస సమాచారం కూడా లేదన్నారు. ప్రయాణికుల పేర్లు, వివరాలు, కనీసం ఫోన్ నెంబర్లు కూడా లేవని తెలిపారు.