100 మంది మహిళలను మోసగించిన మాజీ ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు

Absconding govt. employee held for cheating over 100 women. మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా 100 మంది మహిళలను మోసగించిన ఆరోపణలపై

By Medi Samrat  Published on  18 Feb 2022 4:15 PM IST
100 మంది మహిళలను మోసగించిన మాజీ ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు

మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా 100 మంది మహిళలను మోసగించిన ఆరోపణలపై 42 ఏళ్ల మాజీ ప్రభుత్వ ఉద్యోగిని చిత్తూరు టూ టౌన్ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. కరణం రెడ్డి ప్రసాద్‌ మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్లలో నకిలీ ప్రొఫైల్‌లు సృష్టించి, ధనిక నేపథ్యం ఉన్న మహిళలను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి మోసగిస్తున్నారని డీఎస్పీ ఎన్‌.సుధాకర్‌రెడ్డి తెలిపారు. చిత్తూరులోని పశుసంవర్ధక శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నానని, బాధితులతో పరిచయం ఏర్పడిన తర్వాత రుణాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని మాయమయ్యాడని.. ఇప్పటివరకు కనీసం 100 మంది మహిళలను మోసం చేశాడని పోలీసులు తెలిపారు. బాధితుల్లో ఒకరు చిత్తూరులోని పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న అసలైన డిప్యూటీ డైరెక్టర్‌ ఎం ప్రభాకర్‌ను సంప్రదించగా విషయం వెలుగులోకి వచ్చింది.

ఆర్థికశాస్త్రంలో పోస్ట్రుగాడ్యుయేషన్‌ చేసిన అతడికి.. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న తండ్రి చనిపోతే కారుణ్య నియామకం కింద అటెండర్‌ పోస్టు వచ్చింది. సులభంగా డబ్బు సంపాదించడానికి గొప్పగా ప్రొఫైల్ ను క్రియేట్ చేసుకుని.. పెళ్లి వెబ్‌సైట్లలో ఉంచాడు. మహిళలను మోసంచేసి దాదాపు రూ.25 లక్షలు గుంజాడు. కరణం రెడ్డిప్రసాద్‌ ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. చిత్తూరులోని యాదమరి కాశిరాళ్లకు చెందిన కరణం షణ్ముగం పశుసంవర్ధకశాఖలో పనిచేస్తూ చనిపోవడంతో ఆయన కుమారుడు రెడ్డిప్రసాద్‌కు కారుణ్య నియామకం కింద 2002లో అదే శాఖలో అటెండర్‌గా ఉద్యోగం వచ్చింది.

చిత్తూరులోని పశుసంవర్ధకశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో పనిచేస్తుండగా 2012లో టైపిస్టుగా ఉద్యోగోన్నతి వచ్చింది. సాంకేతిక విద్యార్హతలు చూపకపోవడంతో 2016లో అటెండర్‌గా రివర్షన్‌ ఇచ్చారు. కేరళ టీవీ నటుడి ఫొటో పెట్టి చిత్తూరులోని పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్లు, నెలకు రూ.2 లక్షల జీతం వస్తున్నట్లు పే–స్లిప్‌లు కూడా అప్‌లోడ్‌ చేశాడు. 2015లో తమిళనాడులోని అరక్కోణంలో స్థిరపడిన రెడ్డిప్రసాద్‌ పలు రాష్ట్రాలకు చెందిన మహిళల్ని ఆన్‌లైన్‌లో పరిచయం చేసుకుంటూ తనకు స్వచ్ఛంద సేవాసంస్థ ఉందని, వచ్చే జీతంలో సగానికిపైగా దానధర్మాల కోసం ఖర్చుచేస్తున్నానని ఫోన్‌లో చెప్పేవాడు.

పేదలకు సాయం చేసే తన సంస్థకు సాయం చేయాలంటూ పలువురు యువతుల నుంచి డబ్బు వసూలు చేశాడు. కొందరు అనుమానం వచ్చి పశుసంవర్ధకశాఖ డీడీ ప్రభాకర్‌కి ఫోన్‌ చేశారు. తన పేరును మరొకరు దుర్వినియోగం చేస్తున్నారని గ్రహించి ప్రభాకర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ఎంట్రీతో మొత్తం వ్యవహారం బయటపడింది. 2019లో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో డాలర్లు తెస్తుంటే కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారని చెప్పి చిత్తూరుకు చెందిన యువతి వద్ద రూ.2.45 లక్షలు కాజేసింది తానేనని అంగీకరించాడు. నిందితుడిని అరెస్టుచేసిన పోలీసులు రూ.50 వేల నగదు సీజ్‌ చేశారు.


Next Story