రాజస్థాన్ రాష్ట్రంలోని కోటలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఖటోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో పక్కింటి బాలికను బలవంతంగా లోబర్చుకుని 6 నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు 27 ఏళ్ల వ్యక్తి. వివరాల్లోకి వెళ్తే.. 16 ఏళ్ల బాలిక తల్లి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. ఈ క్రమంలో ఏప్రిల్ నెలలో బాలికను ఇంటి వద్దే ఉంచి తన కొడుకుతో కలిసి తల్లి క్యాన్సర్ చికిత్స కోసం జైపూర్‌కు వెళ్లింది. ఇదే అదనుగా భావించిన నిందితుడు.. బాలికను లైంగికంగా వేధింపులకు గురి చేస్తూ వచ్చాడు. ఒంటరిగా ఉంటున్న బాలికను బెదిరింపులకు గురి చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడు.
బాలికకు తీవ్ర కడుపు నొప్పి రావడంతో స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు ఆమె తల్లిదండ్రులు. ఆ తర్వాత వైద్యులు జరిపిన పరీక్షల్లో ఆమె గర్భవతిగా తేలింది. కోటాలోని ఖటోలీ మెయిన్ బజార్ రోడ్డులో నివాసం ఉంటున్న నిందితుడు చంద్రశేఖర్ అలియాస్ చందుపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధకం చట్టంతో సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. ఏఎస్పీ ప్రవీణ్ జైన్ ఆధ్వర్వంలో కోట రూరల్ ఎస్పీ కవేదం్ర సింగ్ సాగర్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం సోమవారం రాత్రి నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించింది.
9వ తరగతి విద్యార్థిని తల్లి క్యాన్సర్‌తో బాధపడుతోందని, ఈ ఏడాది ఏప్రిల్ 12న తన సోదరుడితో కలిసి క్యాన్సర్ చికిత్స కోసం తల్లి జైపూర్‌కు వెళ్లినట్లు నివేదికలో పేర్కొన్నట్లు ఎస్‌హెచ్‌ఓ రామేశ్వర ప్రసాద్ తెలిపారు.