సిగరేట్ ఉద్దెర ఇవ్వలేదని.. గొంతులో గొడుగుతో పొడిచి.. ఆ తర్వాత..

A young man attacks a small trader. పెద్దపల్లి జిల్లాలో గంజాయి మత్తులో ఉన్న ఓ వ్యక్తి దారుణానికి యత్నించాడు. సిగరెట్‌ ఉద్దెర ఇవ్వలేదని ఓ చిరు వ్యాపారి

By అంజి  Published on  18 Oct 2021 6:33 AM GMT
సిగరేట్ ఉద్దెర ఇవ్వలేదని.. గొంతులో గొడుగుతో పొడిచి.. ఆ తర్వాత..

పెద్దపల్లి జిల్లాలో గంజాయి మత్తులో ఉన్న ఓ వ్యక్తి దారుణానికి యత్నించాడు. సిగరెట్‌ ఉద్దెర ఇవ్వలేదని ఓ చిరు వ్యాపారి గొంతులో గొడుగుతో పొడిచాడు. ఈ ఘటన సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని పూసాల గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పూసాల గ్రామంలో పడాల ప్రసాద్ అనే చిరు వ్యాపారి పాన్‌షాపు నడిపిస్తున్నాడు. రోజువారీలాగే పాన్‌షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి అదే గ్రామానికి చెందిన తెలుకుంట్ల పవన్‌ అనే వ్యక్తి పాన్‌షాపు దగ్గరికి వచ్చాడు.

సిగరెట్‌ ఉద్దెర కావాలని ప్రసాద్‌ను అడిగాడు. అందుకు ప్రసాద్‌.. మొదటగా పాత బాకీ ఇవ్వాలని ఆ తర్వాతే సిగరెట్‌ ఇస్తానని చెప్పాడు. దీంతో అప్పటికే గంజాయి మత్తులో ఉన్న పవన్‌.. తన దగ్గరున్న గొడుగుతో ప్రసాద్‌ గొంతులో పొడిచారు. అక్కడే ఉన్న ప్రసాద్‌ తల్లి నర్సమ్మ జరిగిన ఘటనను చూసి వెంటనే అరిచింది. దీంతో పవన్‌ ఆమెను కూడా గాయపరిచాడు. అయితే గాయపడ్డ ప్రసాద్‌కు ప్రాణపాయం తప్పింది. ప్రసాద్‌ సోదరుడు కిరణ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పవన్‌ను అరెస్ట్‌ చేసినట్లు స్థానిక ఎస్సై తెలిపారు.

Next Story
Share it