జైలుకు వెళ్లి వచ్చే కొందరు క్రిమినల్స్ కు కూడా అభిమానులు ఉంటారు. అలాంటి వ్యక్తికి ఏకంగా గ్రాండ్ వెల్కమ్ ప్లాన్ చేశారు అతడి ఫాలోవర్లు. కానీ ఇప్పుడు వాళ్ళందరూ జైలు పాలయ్యారు. ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో ఓ నేరస్థుడికి స్వాగత ర్యాలీ సందర్భంగా ప్రజలకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించినందుకు 83 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుగ్లకాబాద్ ఎక్స్‌టెన్షన్ నివాసి, నేరస్థుడు అబిద్ అహ్మద్ గురువారం బెయిల్‌పై తీహార్ జైలు నుంచి విడుదలయ్యాడు.
చాలా మంది పేరుమోసిన సహచరులు, నేరస్థులు అతనిని రిసీవ్ చేసుకుంటారని ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియా మీదుగా ర్యాలీగా తీసుకువెళతారని పోలీసులకు సమాచారం వచ్చింది. రాత్రి 10:30 గంటలకు కిర్బీ ప్యాలెస్ వద్ద పికెట్‌లో వారిని అడ్డుకున్నారు పోలీసులు. 19 నాలుగు చక్రాల వాహనాలు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 83 మందిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో 33 మందికి గతంలో హత్య, హత్యాయత్నం, దోపిడీ, ఆయుధాల చట్టం వంటి కేసుల్లో నేర ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.