ఒక షాకింగ్ సంఘటనలో 78 ఏళ్ల మహిళ తన 82 ఏళ్ల భర్త కట్నం కోసం వేధిస్తున్నాడని ఆరోపించింది. తన భర్త తనను కొట్టి ఇంటి నుంచి గెంటేశాడని మహిళ ఆరోపించింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలోని చకేరీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు మహిళ భర్త గణేష్ నారాయణ్ శుక్లా, వారి అల్లుడు సహా ఆరుగురిపై కేసు నమోదు చేశారు. వరకట్న వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న గణేష్ నారాయణ్ శుక్లా సపోర్టు లేకుండా నడవలేరు. వృద్ధ దంపతుల కుమారుడు రజనీష్ విలేకరులతో మాట్లాడుతూ.. తన తల్లి కుటుంబ సభ్యులందరితో చక్కగా ప్రవర్తిస్తుందని, కొందరు బంధువుల ప్రభావంతో ఆమె కేసు పెట్టిందని తెలిపారు.
ఈ మొత్తం వ్యవహారం కుటుంబ కలహాలతో ముడిపడి ఉందని సన్నిహితులు చెబుతున్నారు. వరకట్నం కేసులో బుక్ అయ్యాడని తెలియగానే మా నాన్న షాక్ అయ్యాడని రజనీష్ తెలిపాడు. న్యాయవాది శివేంద్ర కుమార్ పాండే మాట్లాడుతూ.. కుటుంబంలోని సీనియర్ సభ్యులను ఇరికించడానికి వరకట్న చట్టాన్ని దుర్వినియోగం చేశారని అన్నారు. పెళ్లయి చాలా ఏళ్లు గడుస్తున్నా వరకట్న వేధింపుల ఆరోపణలో అర్థం లేదు. ప్రస్తుతం.. ఈ విషయం మధ్యవర్తిత్వంలో ఉంది. ఇరు పక్షాల మధ్య పరస్పర చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించవచ్చని పాండే అన్నారు.