ఘోర రోడ్డుప్రమాదం.. ఎమ్మెల్యే కుమారుడు సహా ఏడుగురు వైద్య విద్యార్థులు దుర్మరణం
7 Medical Students died in an road accident in wardha. వార్ధా జిల్లాలోని సెల్సురా వద్ద సోమవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 25 Jan 2022 3:09 AM GMT
వార్ధా జిల్లాలోని సెల్సురా వద్ద సోమవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మహేంద్ర జైలో వాహనంలో డియోలీ నుంచి వార్ధాకు వెళ్తుండగా.. సెల్సురా వద్దకు రాగానే డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో వాహనం వంతెనపై నుంచి నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో తిరోడా గోరెగావ్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే విజయ్‌భౌ రహంగ్‌డేల్ ఏకైక కుమారుడు ఆవిష్కర్ రహంగ్‌డేల్ కూడా మరణించారు.
మృతులంతా సావాంగిలోని మెడికల్ కాలేజీ విద్యార్థులని తెలుస్తోంది. మృతులను నీరజ్ చవాన్, అవిష్కర్ రహంగ్‌డేల్, నితేష్ సింగ్, వివేక్ నందన్, ప్రత్యూష్ సింగ్, శుభమ్ జైస్వాల్, పవన్ శక్తిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో కారు వంతెనను బలంగా ఢీకొట్టడంతో వంతెన పెన్సింగ్ విరిగి వాహనం నదిలో పడింది. వాహనం దాదాపు 40 అడుగుల వంతెనపై నుంచి కింద పడిపోయింది. మృతి చెందిన విద్యార్థులంతా 25-35 ఏళ్ల మధ్య వయస్కులేనని తెలుస్తోంది. రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ప్రమాదం జరగడంతో.. తెల్లవారుజామున నాలుగు గంటలకు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనపై ప్రస్తుతం పోలీసులు, అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.