బీహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో సోమవారం ఉదయం బాంబు పేలడంతో కనీసం ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనను లఖిసరాయ్ ఎస్పీ సుశీల్ కుమార్ ధృవీకరించారు. పిపారియా పోలీస్ స్టేషన్ పరిధిలోని వాలిపూర్ గ్రామంలో ఉదయం 7 గంటల సమయంలో బాంబు పేలిందని ఆయన తెలిపారు. బాంబును ప్లాస్టిక్ సంచిలో పెట్టి లుటన్ రజక్ అనే వ్యక్తికి చెందిన ఇంటి పెరట్లో ఉంచారు. ప్లాస్టిక్ బ్యాగ్ ఉంచిన ఆ స్థలం సమీపంలో ఒక కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు నిలబడి ఉండగా.. మైనర్ బాలురులో ఒకరు దానిని తెరిచాడు. బ్యాగ్ తెరిచిన వెంటనే బాంబు పేలిందని సుశీల్ కుమార్ తెలిపారు.
బాంబు తీవ్రత తక్కువగా ఉందని.. ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వారికి పిపారియాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స అందించారని ఎస్పీ తెలిపారు. "విచారణ సమయంలో మేం మరో మూడు బాంబులను కూడా కనుగొన్నామని.. గాయపడిన వారి వాంగ్మూలాలు తీసుకున్నాం. బాంబులను అక్కడ ఎలా ఉంచారనే దానిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది' అని ఎస్పీ తెలిపారు. అంతకుముందు మార్చి 9న గోపాల్‌గంజ్‌లో క్రాకర్స్ తయారీ సమయంలో పేలిన బాంబు ఒక వృద్ధుడి ప్రాణాలను బలిగొంది. అంతేకాకుండా మార్చి 4న భాగల్‌పూర్‌లో భారీ పేలుడు సంభవించింది. ఇందులో నాలుగు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. 13 మంది మరణించారు.