మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని దుర్గాపూర్‌లో విద్యుత్ జనరేటర్ నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ వాయువు పీల్చి ఒకే కుటుంబంలోని ఆరుగురు మృత్యువాత పడ్డారు. వర్షం కారణంగా దుర్గాపూర్ ప్రాంతంలో సోమవారం రాత్రి కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రమేష్ లష్కర్ అనే ఓ కాంట్రాక్టర్ తన ఇంట్లోని జనరేటర్‌ను ఆన్ చేసి నిద్రపోయాడు. తెల్లవారినా ఎవరూ బయటకురాకపోవటంతో.. అనుమానం వచ్చిన పక్కింటి వారు తలుపులు పగలగొట్టి చూడగా.. రమేష్ కుటుంబ సభ్యులు విగత జీవులై కనిపించారు. ఇంట్లోని ఓ బాలిక ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా.. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉండగా.. మృతులను రమేష్ లష్కర్(25), అజయ్ లష్కర్(21), మాధురీ లష్కర్(20), పూజా(14), లఖన్(10), కృష్ణ(8)గా గుర్తించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. జనరేటర్ నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ విషవాయువు ఇల్లంతా చుట్టుముట్టి ఊపిరాడకపోవడమే ప్రమాదానికి కారణమని నిర్ధరించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.