అస్సాం రాష్ట్రంలోని మోరిగావ్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 6 నుండి 7 ఏళ్ల మధ్య వయసున్న ముగ్గురు మైనర్ బాలికలపై 50 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తిని సెంట్రల్ అస్సాం జిల్లాలోని లహరిఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెంగోర్‌బోరి గ్రామానికి చెందిన రజనీ కాంత డైమరీగా గుర్తించారు. వివరాల ప్రకారం.. నిందితుడు తన గ్రామానికి చెందిన ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడని, దానికి సంబంధించి లహరిఘాట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుల మేరకు పోలీసులు డిసెంబర్ 20న లహరీఘాట్ పోలీస్ స్టేషన్‌లో పిల్లలపై లైంగిక నేరాల నుంచి రక్షణ (పోక్సో) చట్టంలోని సెక్షన్ 376 ఏబీ, ఆర్/డబ్ల్యూ సెక్షన్ 6 కింద కేసు నమోదు చేశారు.
నిందితుడు బాధితులను ప్రలోభపెట్టి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని స్థానికులు చెబుతున్నారు. నేరం చేసిన తర్వాత నిందితుడు పరారీలో ఉన్నాడని, బుధవారం అమ్టోలా ప్రాంతం నుండి పోలీసులు అతన్ని పట్టుకున్నారని లహరీఘాట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసు అధికారి తెలిపారు. "డిసెంబర్ 20న, 6-7 సంవత్సరాల మధ్య వయస్సు గల ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం చేసిన ఆరోపణలపై రజనీ డైమరీపై లహరిఘాట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బుధవారం ఆమ్తోలా ప్రాంతానికి చెందిన నిందితుడిని పట్టుకున్నాం. మేము బాధితులకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించాము." అని పోలీసు అధికారి తెలిపారు.