ఎక్స్‌ప్రెస్‌వేపై వేగంగా వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. 50 మంది ప్రయాణికులు ఏం చేశారంటే..
ఆదివారం రాత్రి లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై తృటిలో పెను ప్రమాదం తప్పింది.
By Medi Samrat Published on 20 Jan 2025 9:29 AM ISTఆదివారం రాత్రి లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై తృటిలో పెను ప్రమాదం తప్పింది. రాయ్ బరేలీ నుంచి శ్రీ గంగానగర్ వెళ్తున్న స్లీపర్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అరుపుల మధ్య బస్సులో కూర్చున్న 50 మంది ప్రయాణికులు కిటికీల నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది చాలా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
బంగార్‌మౌ ప్రాంతంలోని లక్నో ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై గహర్‌పూర్వా గ్రామ సమీపంలో రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. రాయ్‌బరేలీ నుంచి శ్రీ గంగానగర్ రాజస్థాన్‌కు బస్సు వెళ్తోంది. బస్సులో దాదాపు 50 మంది ప్రయాణికులు కూర్చున్నారు. గహర్‌పూర్వా గ్రామం దగ్గరకు బస్సు చేరుకోగానే తెలియని కారణాలతో మంటలు చెలరేగాయి. డ్రైవర్ తెలివిగా బస్సును వెంటనే ఆపేశాడు. మంటలు ఎగిసిపడుతుండడంతో ప్రయాణికులు కేకలు వేశారు. చాలా మంది ప్రయాణికులు కిటికీ అద్దాలు పగులగొట్టి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. చాలామంది డోర్ దాటి బయటకు వచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అరగంట పాటు శ్రమించి మంటలను ఆర్పారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. బస్సుతోపాటు ప్రయాణికుల లగేజీలు కాలి బూడిదయ్యాయి.
సీఓ అరవింద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఘటనపై సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగే అవకాశం ఉంది. కారణాలపై ఆరా తీస్తున్నారు. మరో బస్సులో ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చామని తెలిపారు.