మధ్యప్రదేశ్‌లో బోరుబావిలో పడిన నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలను వైద్యులు కాపాడలేకపోయారు. బోరుబావి నుంచి బయటకు తీసిన చిన్నారిని ఆస్పత్రికి తరలించగా, అక్కడే చికిత్స పొందుతూ మరణించింది. 25 అడుగుల లోతైన బోరుబావిలో పడిన చిన్నారిని బుధవారం తెల్లవారుజామున 2.30 గంటలకు బయటకు తీశారు అధికారులు. సుమారు 9 గంటల పాటు సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ చిన్నారిని బయటకు తీయగలిగారు. పాపం చిన్నారి ప్రాణాలను మాత్రం నిలబెట్టలేకపోయారు.
రాజ్‌గఢ్ జిల్లాలోని బోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని పిప్లియా రసోడా గ్రామంలో నాలుగేళ్ల మహీ ఆడుకుంటూ వెళ్లి పొలంలో ఉన్న 25 అడుగుల బోరుబావిలో పడిపోయింది. మంగళవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఆమె బోరుబావిలో పడిందని ప్రమాద సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్, రాజ్‌గఢ్ కలెక్టర్ హర్ష్ దీక్షిత్, రాజ్‌గఢ్ ఎస్పీ ధరమ్‌రాజ్ మీనా ఘటనాస్థలికి చేరుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని బోరుబావి లోపల చిక్కుకున్న చిన్నారికి ఆక్సిజన్ అందించే ఏర్పాట్లు చేశారు. దాదాపు 9 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు అధికారులు. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటలకు బయటకు తీసి వెంటనే భోపాల్‌లోని ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడే చిన్నారి చికిత్స పొందుతూ మరణించింది.