హర్యానా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అంబాలా-ఢిల్లీ హైవేపై సోమవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో కనీసం ఐదుగురు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. హీలింగ్ టచ్ హాస్పిటల్ సమీపంలో సోమవారం ఈ ప్రమాదం జరిగింది. "బస్సు ఢిల్లీ వైపు వెళ్తుండగా వెనుక నుంచి మరో బస్సు ఢీకొట్టింది. కేసు నమోదు చేశాం" అని అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ నరేష్ తెలిపారు. ఒక మహిళతో సహా ఐదుగురు మరణించారు. ఎనిమిది మంది గాయపడ్డారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. క్షతగాత్రులను సివిల్ ఆసుపత్రిలో చేర్పించారు.
"సమాచారం ప్రకారం, ఇప్పటివరకు ఐదుగురు మరణించారు. ఇతరులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు" అని హర్యానా ఎమ్మెల్యే అసీమ్ గోయల్ తెలిపారు. గాయపడిన వారి పరిస్థితిని అడిగి తెలుసుకునేందుకు, వారికి మరింత భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చేందుకు ఎమ్మెల్యే గోయల్ ఆసుపత్రిని సందర్శించారు. వారికి భోజన ఏర్పాట్లు చేశామని, వారు క్షేమంగా ఇంటికి చేరేలా చూస్తామని ఎమ్మెల్యే తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.