మహారాష్ట్రలోని థానే జిల్లాలో శుక్రవారం నాడు 46 ఏళ్ల వైద్యుడు తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయిన వ్యక్తిని పవన్ లక్ష్మణ్ సాబ్లేగా గుర్తించారు. అతను జిల్లాలోని మాన్‌పాడ ప్రాంతంలోని హ్యాపీ వ్యాలీ సొసైటీలో నివసిస్తూ ఉన్నాడు. ఘటనా స్థలం నుంచి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. థానే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడు ముంబైలోని పరేల్ ప్రాంతంలోని కేఈఎం ఆస్పత్రిలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ప్రమాద మరణ నివేదిక (ఏడీఆర్) కింద కేసు నమోదు చేశారు.
పవన్ లక్ష్మణ్ ఇంతకు ముందు రాజీనామాకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే దానిని అంగీకరించవద్దని అతని భార్య యాజమాన్యాన్ని అభ్యర్థించిందని KEM ఆసుపత్రి డీన్ పోలీసులకు సమాచారం అందించారు. నివేదికల ప్రకారం పవన్ లక్ష్మణ్ తాగుడు అలవాటు కారణంగా అతని భార్య, పిల్లలు గత కొన్ని వారాలుగా విడివిడిగా నివసిస్తున్నారు.
గత 15 ఏళ్లుగా మద్యం సేవిస్తూ లక్ష్మణ్ తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. అతడికి 12వ తరగతి చదువుతున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య అతడిని విడిచిపెట్టి గత కొన్ని రోజులుగా తల్లి వద్దే ఉంటోందని చితల్‌సర్ పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ గిరీష్ గోడే తెలిపారు. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మృతుడి డ్రైవర్ ఇంటికి వెళ్లడంతో విషయం బయటపడింది. చాలాసార్లు తలుపు తట్టినా లోపల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
దీంతో డ్రైవర్ డాక్టర్ భార్యను అప్రమత్తం చేశాడు. ఆమె వచ్చి తలుపు తెరిచి చూడగా సీలింగ్‌కు వేలాడుతూ కనిపించాడు. ఈ ఘటనపై మృతుడి భార్య పోలీసులకు సమాచారం అందించింది. ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు.