కొడుక్కి సంబంధం చూసేందుకు వెళ్లి.. త‌న‌కో 'తోడు' వెతుక్కున్న త‌ల్లి

నలుగురు పిల్లల తల్లి తన కొడుకు పెళ్లికి అమ్మాయిని చూడటానికి, వారి సంబంధం గురించి మాట్లాడటానికి వెళ్ళింది. అయితే అక్క‌డ ఆమె.. అమ్మాయి అన్నయ్యకు క‌నెక్ట్ అయ్యింది.

By Medi Samrat
Published on : 7 Aug 2025 9:07 AM IST

కొడుక్కి సంబంధం చూసేందుకు వెళ్లి.. త‌న‌కో తోడు వెతుక్కున్న త‌ల్లి

నలుగురు పిల్లల తల్లి తన కొడుకు పెళ్లికి అమ్మాయిని చూడటానికి, వారి సంబంధం గురించి మాట్లాడటానికి వెళ్ళింది. అయితే అక్క‌డ ఆమె.. అమ్మాయి అన్నయ్యకు క‌నెక్ట్ అయ్యింది. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం చిగురించి.. త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. బంధువులు, కుటుంబ సభ్యులు, ప‌రువు, మ‌ర్యాద‌ల‌ను పట్టించుకోకుండా ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. భార్య అదృశ్యంపై మహిళ భర్త ఫిర్యాదు చేయగా.. బుధవారం ఆ మహిళ తన ప్రేమికుడితో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అతనితోనే కలిసి జీవిస్తాన‌ని పట్టుబట్టింది. కుటుంబ సభ్యులు ఎంతగానో ఒప్పించినా ఇద్దరూ ఒప్పుకోలేదు. అర్థరాత్రి ఇద్దరూ లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో జీవించాలనుకుంటున్నట్లు అఫిడవిట్ ఇచ్చారు.

వివ‌రాళ్లోకెళితే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం బిజ్నోర్ స‌మీపంలోని భట్‌పురా గ్రామానికి చెందిన 41 ఏళ్ల మహిళ 14 రోజుల క్రితం తన కొడుకు పెళ్లి కోసం అమ్మాయిని చూసేందుకు పక్క గ్రామం సడక్‌పూర్‌కు వెళ్లింది. ఈ సంబంధం గురించి చర్చలు జరుగుతుండగా.. మహిళ చూపు అమ్మాయి 19 ఏళ్ల అన్నయ్యపై పడింది. ఇద్దరూ మాట్లాడుకుని ప్రేమలో పడ్డారు. కుమారుడి సంబంధం గురించి చర్చ జరిగింది.. కానీ ఖరారు కాలేదు. ఆ త‌ర్వాత వారిద్దరూ కొన్ని రోజులుగా ఫోన్‌లో మాట్లాడుకున్నారని, జూలై 24వ తేదీ తెల్లవారుజామున ఆ మహిళ ప్రేమికుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. జులై 25న మ‌హిళ‌ అదృశ్యంపై ఆమె భర్త పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఆమె కోసం వెతుకుతుండగా.. బుధవారం ఆ మహిళ తన ప్రేమికుడితో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. విషయం తెలుసుకున్న ఇరువురి కుటుంబీకులు అక్కడికి చేరుకున్నారు. వారిని ఒప్పించేందుకు ప్రయత్నించినా పెళ్లి చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. ఇద్దరూ కలిసి లివింగ్ టుగెదర్ అఫిడవిట్ తీసుకొచ్చారని పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ వికాస్ కుమార్ తెలిపారు. అర్థరాత్రి పోలీస్ స్టేషన్‌లో అఫిడవిట్ కాపీ ఇచ్చి వెళ్లిపోయారు. ఆ తర్వాత బంధువులు కూడా ఇళ్ల‌కు వెళ్లారు. ఆ యువకుడు కర్ణాటకలో సెలూన్‌ నడుపుతున్నాడని స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌ తెలిపారు. మహిళ భర్త చండీగఢ్‌లో కూలీగా పనిచేస్తున్నాడు. యువకుడి సోదరి పెళ్లి సంబంధం ఖరారు కాలేదని తెలిపారు.

Next Story