కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి ట్రక్కు, కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మహిళలు సహా నలుగురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు.ట్రక్ డ్రైవర్ అతివేగం మరియు నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు తెలిపారు. ఈ ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. లారీ ఢీ కొనడంతో కారు పూర్తిగా ధ్వంసం అయ్యింది. ప్రమాదానికి కారణమైన లారీ ముందున్న మరో లారీని ఢీకొట్టింది. "బెంగళూరులోని పూర్వాంకర అపార్ట్‌మెంట్ సమీపంలోని నైస్ రోడ్డులో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఇందులో ట్రక్కు వాహనాలను ఢీకొట్టింది" అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ వెస్ట్ కుల్దీప్ జైన్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయని, వారిని ఆస్పత్రికి తరలించామని, చికిత్స పొందుతున్నారని వారు తెలిపారు.
కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. ముదినేపల్లి మండలం చేవూరుపాలెం సెంటర్‌లో రెండు బైక్‌లు ఎదురుదెరుగా ఢీ కొట్టుకున్నాయి. కలిదిండి గ్రామానికి చెందిన నాగరాజు, నాని అనే యువకులు ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఈ ప్రమాదానికి కారణం కూడా అతివేగమే అని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.