క్షణికావేశంలో చోటు చేసుకునే ఘటనలు తీరని విషాదం నింపుతూ ఉంటాయి. తాజాగా అలాంటూ ఘటనే చోటు చేసుకుంది. రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో కుటుంబ కలహాలతో ఓ మహిళ తన నలుగురు పిల్లలతో సహా బావిలో దూకేసింది. నలుగురు పిల్లల్లో నెల వయసున్న పాప కూడా ఉండడం అందరినీ బాధపెడుతూ ఉంది. ఈ ఘటనలో నలుగురు చనిపోగా.. పిల్లల తల్లి మతియా (32) మాత్రం ప్రాణాలతో బయటపడింది. మంగళియావాస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పిల్లలను కోమల్ (4), రింకు (3), రాజ్‌వీర్ (22 నెలలు), దేవరాజ్ (ఒక నెల)గా పోలీసులు గుర్తించారు. రాత్రి ముగ్గురు పెద్ద పిల్లల మృతదేహాలను వెలికి తీయగా, ఈ ఉదయం పసికందు మృతదేహాన్ని వెలికి తీశామని.. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను మార్చురీలో ఉంచామని SHO సునేజ్ టాడా తెలిపారు. మహిళ భర్త బోదురామ్ గుర్జర్ ఒక రైతు. ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని.. దర్యాప్తు జరుపుతున్నామని ఎస్‌హెచ్‌వో తెలిపారు. కుటుంబ కలహాల కారణంగా ఆమె తీసుకున్న నిర్ణయం నలుగురు పిల్లల భవిష్యత్తును నాశనం చేసిందని అంటున్నారు.